డబ్బు ప్యాకెట్‌ కేసులో మాజీ న్యాయమూర్తి నిర్మల్‌ యాదవ్‌ నిర్దోషి

డబ్బు ప్యాకెట్‌ కేసులో మాజీ న్యాయమూర్తి నిర్మల్‌ యాదవ్‌ నిర్దోషి

జడ్జి ఇంటి వద్దకు డబ్బు ప్యాకెట్‌ కేసులో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి నిర్మల్ యాదవ్‌ నిర్దోషిగా తేలారు. చండీగఢ్‌లోని ప్రత్యేక సీబీఐ కోర్టు శనివారం ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మరో ముగ్గురు నిందితులను కూడా నిర్దోషులుగా ప్రకటించింది. మరో నిందితుడు సంజీవ్ బన్సాల్ కేసు విచారణ సమయంలో మరణించాడు. 

17 ఏళ్ల నాటి అవినీతి కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టు అదనపు సెషన్స్ జడ్జి జస్టిస్ అల్కా మాలిక్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 2008 ఆగస్ట్‌ 13న నాటి పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిర్మల్‌జిత్ కౌర్ నివాసానికి ప్రకాశ్‌ రామ్‌ అనే వ్యక్తి వచ్చాడు. ఢిల్లీ నుంచి వచ్చిన పత్రాలు ఉన్నాయంటూ ఒక ప్యాకెట్‌ ఇచ్చాడు.  కాగా, ఆ ప్యాకెట్‌ను తెరిచి చూడాలని తన ప్యూన్‌కు జస్టిస్ నిర్మల్‌జిత్‌ కౌర్‌ చెప్పారు.

దానిని తెరిచి చూడగా రూ.15 లక్షల నోట్ల కట్టలు బయటపడ్డాయి. జస్టిస్ నిర్మల్ యాదవ్‌ నివాసానికి బదులు జస్టిస్ నిర్మల్‌జిత్‌ కౌర్‌ ఇంటికి ఆ డబ్బు ప్యాకెట్‌ చేరినట్లు తెలిసింది. దీంతో ప్రకాశ్‌ రామ్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. నాటి గవర్నర్‌ ఎస్‌ఎఫ్ రోడ్రిగ్స్ పాలనా యంత్రాంగం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది.

మరోవైపు హర్యానా మాజీ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ సంజీవ్‌ బన్సాల్‌ తన ప్యూన్‌ ప్రకాశ్‌ రామ్‌ ద్వారా రూ.15 లక్షల డబ్బును జస్టిస్ నిర్మల్‌ యాదవ్‌కు పంపినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఉత్తరాఖండ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పని చేసిన జస్టిస్ నిర్మల్ యాదవ్ పదవీ విరమణ రోజైన  2011 మార్చి 4న సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది.

కాగా, ఆ డబ్బు చేరవేసిన న్యాయవాది సంజీవ్ బన్సాల్, రూ. 15 లక్షలు పంపిన  ఢిల్లీ వ్యాపారి రవీందర్ సింగ్, ఆయన వ్యాపార భాగస్వామి రాజీవ్ గుప్తా, డబ్బు ప్యాకెట్‌ డెలివరీ చేసిన మరో వ్యక్తి నిర్మల్‌ సింగ్‌పై అభియోగాలు మోపింది. జస్టిస్ నిర్మల్‌ యాదవ్‌ అవినీతికి పాల్పడినట్లు సీబీఐ కోర్టు ఆరోపించింది. అవినీతి నిరోధక చట్టం, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద నిందితులపై అభియోగాలు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.

మరోవైపు జస్టిస్ నిర్మల్ యాదవ్ ఈ ఆరోపణలను ఖండించారు. న్యాయవ్యవస్థలోని సహచరులు తనను లక్ష్యంగా చేసుకుని ఈ కుట్రకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. తనపై జరుగుతున్న సీబీఐ విచారణను హైకోర్టులో సవాల్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఈ కేసులోని నిందితులందరినీ నిర్దోషులుగా సీబీఐ ప్రత్యేక కోర్టు ప్రకటించింది.