కన్నడ నటి రన్యారావుకు మరోసారి బెయిల్‌ నిరాకరణ

కన్నడ నటి రన్యారావుకు మరోసారి బెయిల్‌ నిరాకరణ
బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యా రావుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో రన్యారావుకు బెంగళూరులోని 64వ సీసీహెచ్‌ సెషన్స్‌ కోర్టు బెయిల్‌ నిరాకరించింది. బంగారం స్మగ్లింగ్‌ కేసులో అరెస్టయిన రన్యారావు మొదట బెయిల్‌ కోసం మెజిస్ట్రేట్‌ కోర్టులో పిటిషన్‌ వేశారు.  కోర్టు తిరస్కరించడంతో ఆమె ప్రత్యేక కోర్టును ఆశ్రయించగా అక్కడ కూడా ఆమె పిటిషన్‌ తిరస్కరణకు గురైంది.
బెయిల్‌ కోసం సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని రన్యారావు న్యాయవాదులు నిర్ణయించారు.  దీంతో ఆమె బెయిల్‌ కోసం బెంగళూరులోని 64వ సీసీహెచ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించింది.  బెయిల్‌ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు రెండు రోజుల క్రితం వాదనలు విన్నది. ఈ సందర్భంగా బంగారం అక్రమ రవాణా కేసుకు సంబంధిం డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ కోర్టుకు కీలక విషయాలను వెల్లడించింది.
విదేశాల్లో బంగారం కొనుగోలు చేసేందుకు ఆమె హవాలా మార్గంలో లావాదేవీలు జరిపిన డబ్బులను ఉపయోగించినట్లు డీఆర్‌ఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.  ఈ విషయాన్ని విచారణ సమయంలోనూ నటి రన్యారావు అంగీకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నటితో పాటు డీఆర్‌ఐ తరఫున వాదనలు విన్న కోర్టు మార్చి 27కి తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ మేరకు నటికి బెయిల్‌ నికారిస్తూ ఇవాళ తీర్పు వెలువరించింది.

మార్చి 3న దుబాయి నుంచి వచ్చిన రన్యారావు నుంచి రూ.12.56కోట్ల విలువైన బంగారాన్ని డీఆర్‌ఐ స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత నటిని అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. ఆమె నివాసంలో సోదాలు నిర్వహించగా.. అధికారులు రూ.2.06కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67కోట్ల విలువైన కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.