ఐదేళ్ల తర్వాత చైనా – భారత్ విమాన సర్వీసులు

ఐదేళ్ల తర్వాత చైనా – భారత్ విమాన సర్వీసులు

భారత్, చైనా మధ్య ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చైనా కాన్సుల్ జనరల్ జు వీ తెలిపారు. ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు. కరోనా, గల్వాన్ సంఘర్షణల నేపథ్యంలో భారత్, చైనా మధ్య విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. 

అందుకే ఇప్పుడు విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు జనరల్ జు వీ వెల్లడించారు. ఈ మేరకు కోల్‌కతాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు.కరోనాకు ముందు బీజింగ్‌, షాంఘై, గ్వాంగ్‌జౌ, కున్మింగ్‌ నుంచి భారత్‌లోని డిల్లీ, ముంబయి, కోల్‌కతా, ఇతర నగరాలకు వారానికి 50 విమాన సర్వీసులుండేవని ఆయన చెప్పారు. ఆ సేవలను తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.

విమాన సర్వీసుల పునరుద్ధరణ తర్వాత వీసా నిబంధనల్లో కూడా సడలింపులు చేసే అవకాశం ఉన్నట్లు చైనా కాన్సుల్ జనరల్ జు వీ పేర్కొన్నారు. భారత్‌, చైనా మధ్య దౌత్య సంబంధాలకు మరో వారంలో 75 ఏళ్లు పూర్తవుతుండడం వల్ల ఏప్రిల్‌ 1న ఇరుదేశాలు సంయుక్తంగా కొన్ని వేడుకలను జరుపుకోనున్నట్లు జు వీ వెల్లడించారు. 

భారత్‌తో కలిసి వేడుకలను జరుపుకోవడానికి, దౌత్య సంబంధాలను మరింత మెరుగుపరుచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నామని ఆయన చెప్పారు. జనవరిలో భారత్‌ విదేశాంగశాఖ ప్రతినిధి విక్రమ్‌ మిస్రీ చైనాను సందర్శించిన తర్వాత భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ మొదట ఈ ప్రకటన విడుదల చేసింది. ఇరుదేశాల మధ్య విమాన సేవలను తిరిగి ప్రారంభించడానికి సూత్రప్రాయంగా అంగీకారానికి వచ్చినట్లు తెలిపింది. 

కరోనా మొదలైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. అయితే, ఇటీవల లద్దాఖ్‌ సరిహద్దులో బలగాల ఉపసంహరణ, గస్తీ పునఃప్రారంభం విషయంలో రెండు దేశాలు ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా విమాన సర్వీసుల అంశం చర్చకు వచ్చినట్లు పేర్కొంది.

కాగా, రవీంద్రనాథ్ టాగోర్ చైనా పర్యటించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా చైనా నుండి 20 మంది మేధావులు ఏప్రిల్ 1న విశ్వ భారతిలో జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారని జు వీ  తెలిపారు. చైనా – భారత్ ల మధ్య స్నేహానికి రాయబారిగా పేరొందిన రవీంద్రనాథ్ టాగోర్ 1924లో 50 రోజుల పాటు చైనాలో పర్యటించి అన్ని వర్గాల వారిని కలుసుకున్నారని, అనేక ప్రసంగాలు చేసారని ఆయన వివరించారు.

 
భారత్ చైనాకు ముఖ్యమైన వాణిజ్య భాగస్వామి అని పేర్కొంటూ చైనా గణాంకాల ప్రకారం  తమ రెండు దేశాల మధ్య 138.5 బిలియన్ డాలర్ల వాణిజ్యం ఉందని చెప్పారు. 2023లో 136.2 బిలియన్ డాలర్లు ఉందని పేర్కొన్నారు.