వచ్చే ఏడాది అక్టోబర్ లోగా గ్రామ గ్రామానికి ఆర్ఎస్ఎస్

వచ్చే ఏడాది అక్టోబర్ లోగా గ్రామ గ్రామానికి ఆర్ఎస్ఎస్
నూరేళ్ళ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా సంఘ్ ఆలోచనలు, భావాలను సమాజం వద్దకు తీసుకెళ్లేలా వచ్చే నవంబర్ నుండి జనవరి వరకు దేశంలో ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి వెళ్లడానికి జన సంపర్క అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)  తెలంగాణ ప్రాంత కార్యదర్శి కాచం రమేష్ తెలిపారు.
 
బెంగళూరులో మార్చి 21 నుంచి 23 తేదీల మధ్య జరిగిన ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభల తీర్మానాలు, సంఘ్ శతాబ్ది సంవత్సరం సందర్భంగా తెలంగాణలోను, దేశవ్యాప్తంగాను చేపట్టనున్న ప్రత్యేక కార్యక్రమాల గురించి బుధవారం మీడియా సమావేశంలో వివరించారు.
 
తెలంగాణలోని ప్రతి గ్రామ పంచాయితీలోను, ప్రతి బస్తీలోనూ, ప్రతి మూల మూలనా అందరినీ కలుపుకుని వెళ్లేలా కరపత్రం, పుస్తకం పంపిణీ ద్వారా  ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా అనేక బస్తీలు, ఉపమండలాలు, బ్లాక్ స్థాయిలోను, నగరాలలో ప్రతి లక్షమంది ఒక యూనిట్‌గా హిందూ సమాజ ఉత్సవాలు చేస్తామని, ఇందులో స్థానిక నేతలు, హిందూ సంస్థలకు భాగస్వామ్యం కల్పించి హిందుత్వాన్ని, ధర్మాన్ని సమాజంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు.
 
మనమంతా ఒక్కటేననే ఏకాత్మ భావనను, సమరసతను ప్రేరేపించేలా ప్రతి బ్లాక్‌లోను వివిధ సంస్థలు, మఠాలు, కులాల ప్రముఖ వ్యక్తుల భాగస్వామ్యంతో సామాజిక సద్భావన సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. ఇంకా, పర్యావరణ హితం, స్వదేశీ జీవన విధానాన్ని పాటించడం, సామాజిక అనుశాసనం, చట్టాలను పాటించడం, హిందూ కుటుంబాలను కాపాడటం వంటి అంశాలను తీసుకుని సామాజిక సద్భావన సదస్సులు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తామని వివరించారు. 
 
అదే క్రమంలో జిల్లా కేంద్రాలు, నగర కేంద్రాలలో ప్రతిష్ఠిత వ్యక్తులు, యువకులతో సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది సెప్టెంబర్ – అక్టోబర్ నెలల్లో గ్రామగ్రామానికి శాఖను తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఈ ఉత్సవాలకు ముందే తెలంగాణలో ప్రతి ఉపమండలం, బస్తీలో అన్నింటా కలిపి శాఖల సంఖ్యను 4 వేలకు చేర్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పారు.

దేశవ్యాప్తంగా మొత్తం 51,570 స్థలాల్లో దైనందిన శాఖలు 83,129 నడుస్తున్నాయి. వీటితో పాటు 32,147 శాఖా మిలన్లు (వీక్లీ),  12,091 నెలవారీ శాఖలు (మండలి) నడుస్తున్నాయి. మొత్తంగా 1,27,367 శాఖాపరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయని రమేష్ తెలిపారు. 

తెలంగాణలో మొత్తం 1,839 స్థలాలలో 3,117 శాఖలు నడుస్తుండగా గతేడాదితో పోల్చితే 392 కొత్త శాఖలు ప్రారంభమయ్యాయని,  వారంవారీ సాప్తాహిక్ మిలన్లు 382, నెలవారీగా 224 శాఖలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇవన్నీ కలిపి తెలంగాణలో 3,800 పైచిలుకు శాఖలు నడుస్తున్నాయని చెప్పారు. స్లమ్స్‌లో సేవాబస్తీల పేరిట సంఘకార్య విస్తరణ ప్రయత్నం జరుగుతోందంటూ తెలంగాణలోని పలు సేవాబస్తీలలో శాఖల ద్వారా 980కి పైగా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని వివరించారు. 
ఇక బంగ్లాదేశ్‌లోని మైనార్టీలు, ప్రత్యేకించి హిందువులపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తూ ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రతినిధి సభలో చేసిన తీర్మానం గురించి ప్రస్తావిస్తూ ఇస్లామిక్ జిహాదీలు హిందూ మహిళలపై చేసిన అత్యాచారాలు, హిందువుల ఆస్తుల లూటీ, గృహదహనాలు తదితర పరిణామాలను, ఈ హింసాకాండను నిరోధించేందుకు అంతర్జాతీయ సమాజం స్పందించాలని కోరినట్లు తెలిపారు.

అదే సమయంలో పోర్చుగీసువారిపై పోరాడిన భారత స్వాతంత్ర్య పోరాట యోధురాలు రాణి అబ్బక్క 500వ జయంతిని సందర్భంగా ఆర్ఎస్ఎస్ సర్‌కార్యవాహ దత్తాత్రేయ హొసబాళె ఓ ప్రకటన విడుదల చేసిన్నట్లు తెలిపారు.  గత ఏడాది రాణి అహల్యా బాయి 300వ జయంతి సందర్భంగా నిర్వహించిన సామాజిక సమరసత కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ల వితరణ గురించి వివరించారు.