ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందే

ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందే
అంతర్జాతీయ వేదికపై భారత్‌ను నిందించాలని మరోసారి యత్నించిన పాకిస్థాన్‌కు మళ్లీ భంగపాటు ఎదురైంది. జమ్మూ కశ్మీర్పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి భారత్ గట్టిగా చురకలంటించింది. ఆ ప్రాంతం ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని మరోసారి స్పష్టం చేసింది. పాక్ చట్టవిరుద్ధంగా ఆక్రమించిన కశ్మీర్ భూభాగాలను ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పింది. 

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా మాట్లాడిన పాక్ ప్రతినిధి సయ్యద్ తారిఖ్ ఫతేమీ, జమ్మూ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది. పాక్‌ ఆరోపణలపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ అభ్యంతరం వ్యక్తంచేశారు. 

ఆ దేశం అనవసర అంశాలను లాగుతోందని మండిపడ్డారు. సంకుచిత, విభజన ఎజెండాతో ఈ వేదిక దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని సూచించారు. “భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇలా పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజమైపోవు” అంటూ ఐరాసలో భారత్ శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

“ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. జమ్మూకశ్మీర్‌లోని కొంత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు పాకిస్థాన్ నిరంతంరంగా యత్నిస్తోంది. దాన్ని పాకిస్థాన్ కచ్చితంగా ఖాళీ చేయాల్సిందే. సంకుచిత, విభజన ఎజెండాతో ఈ వేదిక దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిదని సూచిస్తున్నాం” అంటూ హరీష్ హితవు చెప్పారు.

జమ్మూ కాశ్మీర్ లో కొనసాగుతున్న పాకిస్తాన్ ఆక్రమణ అంతర్జాతీయ న్యాయసూత్రాలకు వ్యతిరేకం అని భారత్ మండిపడింది. ప్రభుత్వేతర శక్తులు వంటి ఆధునిక సవాళ్ళను ఎదుర్కొనేందుకు ఐరాస ప్రత్యేక మిషన్ లను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

గతవారం ఐరాస మానవ హక్కుల సంఘం సమావేశంలోనూ పాక్‌ జమ్మూకశ్మీర్‌ అంశాన్ని ప్రస్తావించింది. దీనికి భారత్‌ కూడా దీటుగా బదులిచ్చింది. పాక్‌ పదే పదే అసత్య ప్రచారాలు చేస్తోందని దుయ్యబట్టింది. ఆ దేశానిది మతోన్మాద మనస్తత్వం అని ఇలాంటి వ్యాఖ్యలతో అబద్ధాలను నిజం చేయలేరని భారత్‌ పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరని చురకలంటించింది.