వచ్చే ఐదేళ్లలో భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య రెట్టింపు

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య రెట్టింపు

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో స్టార్టప్‌ల సంఖ్య రెట్టింపు కావొచ్చని ఎగ్జిక్యూటివ్‌ సర్చ్‌ సంస్థ లాంగ్‌హౌస్‌ అంచనా వేసింది. 2030 నాటికి స్టార్టప్‌ల సంఖ్య 2.4 లక్షలకు చేరొచ్చని తెలిపింది. 2023లో స్టార్టప్‌ల సంఖ్య 1.2 లక్షలుగా ఉందని.. భారతదేశ స్టార్టప్‌ పర్యావరణ వ్యవస్థ వేగంగా విస్తరించేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించింది. 

లాంగ్‌హౌస్‌ రిపోర్ట్‌ ప్రకారం.. స్టార్టప్‌ల పెరుగుదలతో యూనికార్న్‌లు లేదా 1 బిలియన్‌ డాలర్లు (రూ.8600 కోట్లు) విలువ కలిగిన సంస్థలు పెరగొచ్చు. 2030 చివరి నాటికి యూనికార్న్‌ల సంఖ్య 280కి చేరొచ్చు. ప్రస్తుతం వీటి సంఖ్య 120గా ఉంది. స్టార్టప్‌ల విస్తరణ ఉపాధిని భారీగా పెంచనుంది. స్టార్టప్‌లు కీలక రంగాలలో ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ కల్పనకు దోహదం చేయనున్నాయి.

వచ్చే 2030 నాటికి స్టార్టప్‌ల్లో మొత్తంగా ఐదు కోట్ల ఉద్యోగాలు సృష్టించబడే అవకాశాలున్నాయని లాంగ్‌హౌస్‌ నివేదిక తెలిపింది. వీటిలో 40 నుంచి 50 లక్షలు వైట్‌ కాలర్‌ ఉద్యోగాలు ఉండొచ్చు. మరో కోటి ఉద్యోగాలు గిగ్‌ ఎకానమీ నుండి వస్తాయి. పరిశ్రమలలో 3.5 కోట్ల నుంచి 4 కోట్ల పరోక్ష ఉద్యోగాలు ఉండొచ్చని అంచనా. 

”ఇప్పటికే ఉన్న స్టార్టప్‌ల్లో కంటే కొత్త సంస్థల్లోనే ఎక్కువ ఉద్యోగాల సృష్టి చోటు చేసుకోవచ్చు. దేశంలో ప్రస్తుతం 120 యూనికార్న్‌లుండగా.. 2030 నాటికి 280కి చేరొచ్చు. ముఖ్యంగా ఎఐ, సాస్‌, క్లీన్‌ టెక్‌, ఫిన్‌టెక్‌ రంగాల్లో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉండొచ్చు.” అని లాంగ్‌హౌస్‌ సీనియర్‌ పార్ట్‌నర్‌ రోహిత్‌ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

2020 నుంచి 2024 మధ్య యునికార్న్‌ వ్యవస్థాపకులలో దాదాపు 40 శాతం మందికి 10 నుండి 15 సంవత్సరాల ముందు పని అనుభవం ఉంది. ఇది 2008 నుండి 2013 కాలంలో 26 శాతంగా ఉంది. యునికార్న్‌ వ్యవస్థాపకులలో 55 శాతం మంది తమ వెంచర్‌లను ప్రారంభించే ముందు ఏదో ఒక సంస్థలో నాయకత్వ పాత్రలను కలిగి ఉన్నారు. 

20 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న యునికార్న్‌ వ్యవస్థాపకుల వాటా ఇటీవలి సంవత్సరాలలో 30 శాతానికి చేరుకుంది. ఇది మరింత అనుభవ వ్యాపారవేత్తల వైపు మళ్లడాన్ని సూచిస్తుంది. కాగా.. ఇటీవల స్టార్టప్‌లకు తగ్గుతోన్న నిధుల నేపథ్యంలో ఆ సంస్థలు ఆర్ధికంగా ఎలా మద్దతును అందుకోగలవో వేచి చూడాలి.