జస్టిస్ యశ్వంత్‌వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు

జస్టిస్ యశ్వంత్‌వర్మ తిరిగి అలహాబాద్ హైకోర్టుకు
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో భారీ ఎత్తున నోట్లకట్టలు బయటపడిన వ్యవహారంలో సుప్రీంకోర్టు కొలీజియం సోమవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మను తిరిగి అలహాబాద్ హైకోర్టుకు పంపాలని అధికారికంగా సిఫారసు చేసింది. ఈ మేరకు సీజేఐ సంజయ్ ఖన్నా, న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, సూర్య కాంత్, ఓసీ ఓకాతో కూడిన కొలీజియం అధికారిక ప్రకటన జారీ చేసింది. 
 
”మార్చి 20, 24 తేదీల్లో సమావేశమైన కొలీజియం హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టు జ్యురిస్‌డిక్షన్‌ను పంపాలని సిఫారసు చేస్తోంది” అని ఆ అధికారిక ప్రకటన పేర్కొంది. దీనికి మందు, జస్టిస్ యశ్వంత్ వర్మను న్యాయపరమైన విధులకు దూరంగా ఉంచుతూ ఢిల్లీ హైకోర్టు రిజిస్ట్రీ సోమవారం ఉదయం నిర్ణయం తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. 

మరోవైపు ఈ వ్యవహారంలో న్యాయపరమైన దర్యాప్తు జరగాలని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. ‘దేశ చరిత్రలో ఒక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు బయటపడటం ఇదే తొలిసారని’ ఆప్‌ రాజ్యసభ ఎంపీ సంజయ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో ప్రజలకు న్యాయవ్యవస్థపై ఉన్న నమ్మకం దెబ్బతింటుందని హెచ్చరించారు. వెంటనే ఆయన రాజీనామా చేయాలని, పార్లమెంట్‌లో కూడా ఈ వ్యవహారంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

“గతంలో ఓ న్యాయమూర్తి తన పదవికి రాజీనామా చేసి మరుసటి రోజే రాజకీయ పార్టీలో చేరడం, ఓ సీజేఐ పదవీ విరమణ చేసి పార్లమెంటు సభ్యుడిగా బాధ్యతలు చేపట్టడం, ఇప్పుడు మరో న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు దొరకడం ఇలాంటి ఘటనలు న్యాయ వ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయని” తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ కల్యాణ్‌ బెనర్జీ విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని అభిశంసించాలని సీపీఐ ఎంపీ పి.సందోశ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.