
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో విద్యాశాఖను మూసివేశారు. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. అమెరికా విద్యావ్యవస్థలో సమూల మార్పులు తెస్తానని ట్రంప్ గతంలో ఎన్నికల సమయంలో ప్రకటించారు. అందులో భాగంగా ఇప్పటికే ఆ శాఖలో భారీగా ఉద్యోగులను తొలగించారు. ఇప్పుడు విద్యాశాఖనే మూసివేస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు.
వైట్‌హౌస్‌లో పాఠశాల విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప విద్యాశాఖ మూసివేత ఆర్డర్లపై సంతకాలు చేశారు. దీన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు ఈ సందర్భంగా ట్రంప్ ప్రకటించారు. ఈ శాఖ ద్వారా ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదని వ్యాఖ్యానించారు. అంతేకాదు విద్యాశాఖ అధికారులను రాష్ట్రాలకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అయితే, విద్యార్థుల ఫీజుల రాయితీలు, కొన్ని ముఖ్యమైన పథకాలను మాత్రం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశాలను ఇతర విభాగాలు చూస్తాయని చెప్పారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై డెమోక్రాట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా విద్యపై పెడుతున్న వ్యయం పెరుగుతున్నప్పటికీ, విద్యా ప్రమాణాల మెరుగుదలకు దోహదపడటం లేదని, అమెరికన్ విద్య నాణ్యతను గణనీయంగా పెంచడంలో విద్యా శాఖ విఫలమైందని ట్రంప్ విమర్శలు కురిపిస్తున్నారు.
1979లో ఈ విభాగం ఏర్పాటుకు రిపబ్లికన్ల నుండి మాత్రమే కాకుండా అప్పటి అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ సొంత మంత్రివర్గ సభ్యుల నుండి కూడా ప్రతిఘటన ఎదురైందని ఆయన గుర్తు చేశారు. ముఖ్యంగా, ట్రంప్ తరచుగా విద్యా శాఖను విమర్శిస్తూ, దానిని “అసమర్థమైనది”, “ఉదారవాద భావజాలాలచే ఎక్కువగా ప్రభావితమైంది” అని అభివర్ణిస్తున్నారు.
విద్యా విధానాన్ని ఫెడరల్ స్థాయిలో నిర్వహించకుండా రాష్ట్ర, స్థానిక స్థాయిలో నిర్ణయించాలని వాదించే సంప్రదాయవాద విమర్శకుల దృష్టికి ఈ సంస్థ తరచుగా వస్తుంది. ఈ కార్యనిర్వాహక ఉత్తర్వు విద్యలో సమాఖ్య ప్రభుత్వ పాత్రలో ఒక ప్రధాన మార్పుకు నాంది పలికింది. రాష్ట్రాలు, స్థానిక సంస్థలకు సాధికారత కల్పించడం కేంద్రీకృత పర్యవేక్షణ కంటే మెరుగైన ఫలితాలను ఇస్తుందని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు.
వైట్ హౌస్ ప్రకారం, అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1979 నుండి 3 ట్రిలియన్ల డాలర్లకు పైగా ఖర్చు చేసింది. అప్పటి నుండి, ప్రతి విద్యార్థి ఖర్చు 245 శాతానికి పైగా పెరిగింది. అయినా 13 ఏళ్ల పిల్లలలో గణితం, పఠన స్కోర్లు దశాబ్దాలలో అత్యల్ప స్థాయిలో ఉన్నాయని వైట్ హౌస్ డేటా చూపిస్తుంది. నాల్గవ తరగతి విద్యార్థులలో పది మందిలో ఆరుగురు, ఎనిమిదవ తరగతి విద్యార్థులలో దాదాపు మూడు వంతులు గణితంలో ప్రావీణ్యం కలిగి లేరు.
నాల్గవ, ఎనిమిదవ తరగతి విద్యార్థులలో పది మందిలో ఏడుగురు చదవడంలో ప్రావీణ్యం కలిగి లేరు. అయితే నాల్గవ తరగతి విద్యార్థులలో 40 శాతం మంది ప్రాథమిక పఠన స్థాయిలను కూడా అందుకోరు. ప్రామాణిక పరీక్ష స్కోర్లు దశాబ్దాలుగా స్థిరంగా ఉన్నాయి. అమెరికా విద్యార్థులు గణితంలో 37 ఓఈసీడీ సభ్య దేశాలలో 28వ స్థానంలో ఉన్నారు.
More Stories
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన