తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి

తిరుమలలో హిందువులు మాత్రమే పనిచేయాలి
తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీటీడీ అధికారుల‌ను ఆయన ఆదేశించారు. టీటీడీలో అన్యమత ఉద్యోగులను తొలగించడానికి ఆదేశాలు ఇచ్చామని వెల్లడించారు. మనవుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం తిరుమ‌ల‌లో శ్రీవారిని కుటుంబ స‌భ్యుల‌తో ద‌ర్శించుకున్న అనంత‌రం చంద్రబాబు స్థానిక పద్మావతి అతిథి గృహంలో తిరుమ‌ల‌పై సమీక్ష చేపట్టారు. 
 
తిరుమల అభివృద్ధిపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఇతర అధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  గడిచిన ఐదేళ్లలో చాలా దారుణాలు జరిగాయని, తిరుమల నుంచే ప్రక్షాళన చేస్తానని ఎన్నికల వేళ చెప్పానని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చాక ఆ మేరకు చర్యలు తీసుకున్నానని వివరించారు. 
 
అప్పట్లో ఏడు కొండలను ఆనుకుని ముంతాజ్ హోటల్ కు అనుమతి ఇచ్చారని, ఆ హోటల్ కు 20ఎకరాలు కేటాయించారని ముఖ్యమంత్రి విమర్శించారు. దీనిపై తాము చర్యలు తీసుకున్నామని, మరో 35.32 ఎకరాల్లో వివిధ సంస్థలకు భూ కేటాయింపులను కూడా రద్దు చేశామని తెలిపారు. ఏడు కొండలను ఆనుకుని వాణిజ్యపరమైన అంశాలకు అనుమతించేది లేదని స్పష్టం చేశారు. వ్యక్తిగత ప్రయోజనాలకు చోటులేదని స్పష్టంగా చెప్పామని పేర్కొన్నారు. 
 
వెంకటేశ్వరస్వామి ఆస్తులన్నీ కాపడట‌మే తమ లక్ష్యమని చెబుతూ  తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారని, అన్నదానానికి చాలామంది విరాళాలు ఇస్తున్నారని వెల్లడించారు. భక్తులకు అన్నప్రసాదాలు స్వయంగా వడ్డిస్తే కలిగే తృప్తి వెలకట్టలేనిదని తెలిపారు. ప్రతిఒక్కరూ సమాజ హితం కోసం పనిచేయాలని ఆయన  సూచించారు. ఏడు కొండలు వెంకటేశ్వరస్వామి సొంతమ‌ని స్పష్టం చేశారు. ఏడుకొండల్లో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలు జరగరాదని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వరస్వామి ఆలయాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు వివరించారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ముందుకొస్తే త్వరితగతిన ఆలయ నిర్మాణాలు చేపడతామని చెప్పారు. అంతేకాకుండా, ప్రపంచవ్యాప్తంగా హిందువులు ఎక్కువగా ఉన్నచోట ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు.

 
 శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఆలయ ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపారు. ఇక అన్నదానం, ప్రాణదానం తరహాలోనే మాధవ సేవ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని ఆయన వెల్లడించారు.

శ్రీవారి చంద్రబాబు కుటుంబం వెంగమాంబ అన్నవితరణ కేంద్రానికి వెళ్లారు. తిరుమలలో ఒకరోజు అన్నదానానికి అయ్యే ఖర్చు రూ. 44 లక్షలను విరాళాన్ని ముందే చెల్లించి, నేడు స్వయంగా భక్తులకు వడ్డించారు. అన్న వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు ప్రసాదాలు వడ్డించారు. దేవాంశ్ కూడా ఉత్సాహంగా ప్రసాదాలు వడ్డించాడు.

అనంతరం చంద్రబాబు కుటుంబం కూడా అక్కడే అన్నప్రసాదాలు స్వీకరించింది. కాగా మనవడు దేవాంశ్ పుట్టినరోజునాడు తిరుమల శ్రీవారి సేవలో తరించే ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబం, ఈ ఏడాదీ అదే ఆనవాయితీ కొనసాగించింది. చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి, దేవాంశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.