యూకే పార్ల‌మెంట్‌లో చిరంజీవికి సత్కారం

యూకే పార్ల‌మెంట్‌లో చిరంజీవికి సత్కారం
మెగాస్టార్ చిరంజీవి భారతీయ సినిమాలో ఓ విలక్షణమైన నటుడు. నాలుగున్నర దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ పరిశ్రమలో రాణిస్తున్న ఆయన ఎన్నో అవార్డుల‌ని కూడా అందిపుచ్చుకున్నారు. తాజాగా యుకే పార్లమెంట్‌ నుంచి అరుదైన సత్కారం అందుకున్నారు. చిరంజీవికి యూకే పార్ల‌మెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అఛీవ్‌మెంట్‌తో సత్కరించారు. 
 
యూకే అధికార లేబ‌ర్ పార్టీ ఎంపీ న‌వేందు మిశ్రా ఆధ్వ‌ర్యంలో వేడుక జ‌రిగింది. పార్ల‌మెంట్ స‌భ్యులు సోజ‌న్ జోసెఫ్‌, బాబ్ బ్లాక్ మ‌న్ త‌దిత‌రులు పాల్గొని చిరంజీవికి అవార్డ్ అందించారు. చిరంజీవిని హౌజ్ ఆఫ్ కామ‌న్స్‌- యూకే పార్ల‌మెంట్‌లో ఘ‌నంగా స‌త్క‌రించ‌గా, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.
 
కాగా, ఇంతటి అరుదైన సత్కారం దక్కించుకున్న చిరుకు ఆయన తమ్ముడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తమ్ముడిగా పుట్టినందుకు గర్విస్తున్నానని చెప్పారు. ఈ పురస్కారం ఆయనకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని పురస్కారాలు అందుకుని తామందరికీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటున్నానంటూ పవన్ ఎక్స్​లో రాసుకొచ్చారు.

సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి ‘జీవిత సాఫల్య పురస్కారం’ ప్రదానం చేసింది బ్రిడ్జి ఇండియా సంస్థ. బ్రిడ్జి ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు, వారు తమ చుట్టూ ఉన్న స‌మాజంపై చూపించిన ప్ర‌భావం మ‌రింత విస్తృతం కావాల‌నే ఉద్దేశంతో ఇలా స‌త్క‌రిస్తూ ఉంటారు. 

బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్‌మెంట్ అవార్డును తొలిసారిగా చిరంజీవికి అంద‌జేసింది. అంద‌జేస్తోంది. ఇది చిరంజీవి కీర్తి కీర‌టంలో మ‌రో క‌లికితురాయిగా నిలుస్తుంది. ఇక గతేడాది దేశ రెండో అత్యున్నత పురస్కార్ పద్మవిభూషణ్ చిరంజీవి కీర్తి కిరీటంలో చేరింది. అలాగే నృత్యాల్లో ఆయన సాధించిన ఘనతని గుర్తించి గిన్నీస్ బుక్‌లో చోటిచ్చారు. 

నృత్యాల్లో గిన్నీస్ రికార్డు అందుకున్న నటుడు ప్రపంచంలో మెగాస్టార్ చిరంజీవి తప్ప ఎవరూ లేరు. 156 సినిమాల్లో 537 పాటల్లో 24000 డాన్స్ మూవ్స్ చేసారు చిరంజీవి. ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో అక్కినేని ఇంటర్నేషనల్ ఫౌండేషన్ 2024లో భాగంగా చిరంజీవికి ప్రతిష్టాత్మక ఎ.ఎన్‌.ఆర్ జాతీయ అవార్డును ప్రదానం చేసిన విష‌యం తెలిసిందే.