మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించిన శశిథరూర్

మరోసారి ప్రధాని మోదీని ప్రశంసించిన శశిథరూర్
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్ మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ప్రశంసించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని మొదట్లో తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని స్పష్టం చేశారు. భారత వైఖరిని విమర్శించి తాను ఒక మూర్ఖుడిలా మిగిలానని పేర్కొన్నారు. 
 
ప్రపంచానికి శాంతి అనేది చాలా కీలకమని, యుద్ధరంగంలో శాంతి సాధ్యం కాదని నరేంద్ర మోదీ అనేవారని పేర్కొంటూ చాలా తక్కువ దేశాలకు సాధ్యమయ్యే శాశ్వత శాంతిని తీసుకువచ్చే స్థితిలో ప్రస్తుతం మన దేశం ఉందని ఆయన కొనియాడారు.  ”రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి ప్రపంచానికి చాలా కీలకం. కదనరంగంలో శాంతి దొరకదని మన ప్రధాని చెప్పారు. శాంతి కోసం సంప్రందింపులు జరగాలని సూచించారు. ఇందుకు అవసరమైన ప్రక్రియ ఇప్పటికే మొదలైంది” అని శశిథరూర్ తెలిపారు. 

అయితే, కాల్పుల విరమణ గురించి మాత్రమే వాళ్లు మాట్లాడతారా? శాంతి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనేది తెలియదని, ఏమి జరుగుతుందో వేచిచూడాలని చెప్పారు. ముందస్తు ఊహాగానాలు సరికాదని స్పష్టం చేశారు.

రైసీనా డైలాగ్‌లో ప్యానల్ డిస్కషన్‌పై థరూర్ మాట్లాడుతూ, 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పుడు భారత్ దానిని ఖండించాలని తాను చెప్పానని గుర్తు చేశారు. అప్పటి తన వాదనకు యూఎస్ చార్టర్‌లోని ఆదర్శాలే కారణమని తెలిపారు. అంతర్జాతీయ వివిదాల పరిష్కరాన్ని బలాన్ని ప్రయోగించడాన్ని వ్యతిరేకించిన చరిత్ర భారత్‌కు ఉందని గుర్తుచేశారు. 

అంతర్జాతీయ సరిహద్దులు, సౌర్వభౌమాధికాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే భారత్ ఖండిచాల్సిందేనని, అయితే ఆరోజు రష్యా- ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించినప్పుడు భారత్ ఒక విధానం తీసుకోలేదని తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత తాను మూర్ఖుడిలా మిగిలానని చెప్పారు.  భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని, రెండు వారాల వ్యవధిలోనే ఉక్రెయిన్, రష్యా అధ్యక్షులను మోదీ ఆలింగనం చేసుకోవడం, రెండుచోట్లా ఆమోదం పొందడం మనం చూశామని తెలిపారు.

థరూర్ వ్యాఖ్యలను స్వాగతించిన బీజేపీ

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని, తీసుకుంటున్న చొరవను శశిథరూర్ ప్రసంగించడాన్ని బీజేపీ నేతలు రవి శంకర్ ప్రసాద్, సంబిత్ పాత్ర స్వాగతించారు. శశిథరూర్ తరహాలోనే రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరికి మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నిలవాలని వారు కోరారు. 

శశిథరూర్‌కు దౌత్యం గురించి తెలుసునని, ఆయన చాలాకాలం యూఎన్‌లో పనిచేసారని బీజేపీ నేత సంబిత్ పాత్ర గుర్తు చేశారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో మోదీ అనుసరించిన విధానాన్ని శశిథరూర్ ప్రశంసించారని చెప్పారు. పదేపదే మోదీని, దేశాన్ని విమర్శించే కాంగ్రెస్ ఇతర నేతల కూడా ఆయన చూసి నేర్చుకోవాలని హితవు చెప్పారు.