రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్

రూ.3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్
 
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం శాసనసభలో రాష్ట్ర ఆర్థిక పద్దును ప్రవేశపెట్టారు. ​రూ.3,04,965 కోట్ల అంచనా వ్యయంతో తొలిసారి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈసారి సంక్షేమ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రెవెన్యూ వ్యయం రూ.2,26,982 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.36,504 కోట్లుగా ఉంది. రాష్ట్రం అప్పులు రూ.5,04,814 కోట్లుగా ఉంది. 

ఇక అత్య‌ధికంగా ఎస్సీ సంక్షేమానికి రూ. 40,232 కోట్లు కేటాయించారు. ఆ త‌ర్వాత వ్య‌వ‌సాయ శాఖ‌కు రూ. 24,439 కోట్లు, నీటి పారుద‌ల రంగానికి రూ. 23,373 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ పాలనలో ఛిద్రమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నామని, తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు.

హైదరాబాద్​లో సమగ్ర వరద నీటిపారుదల ప్రాజెక్టుకు రూ.5,942 కోట్లు కేటాయిస్తామని బడ్జెట్​ ప్రసంగంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. దేశానికే తలమానికంగా ఉండేలా ఫ్యూచర్​ సిటీని రూపొందిస్తున్నామన్నారు. ఓఆర్​ఆర్​ ఫేజ్​-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందని వివరించారు. ఫేజ్​-2 ద్వారా హెచ్​ఎండీఏలో విస్తరించిన ప్రాంతాలకు తాగునీరు అందిస్తామని చెప్పారు.

ఫ్యూచర్​ సిటీ శ్రీశైలం- నాగార్జునసాగర్​ రహదారుల మధ్య ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపేందుకు మెగా మాస్టర్​ ప్లాన్​ 2050 రూపొందిస్తామన్నారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పదేళ్లలో ట్రిలియన్ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ చేపడుతున్నామని పేర్కొన్నారు.  చైనా ప్లస్​ వన్​ వ్యూహంతో రాష్ట్రాన్ని గ్లోబల్​ తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి భట్టి తెలిపారు.
ప్రతి మండలంలో మహిళలతో రైస్​ మిల్లులు, మినీ గోదాములు ఏర్పాటు చేస్తామన్నారు. ఐకేపీ కేంద్రాల్లో కొన్న ధాన్యాన్ని మహిళా రైస్​ మిల్లుల్లో మిల్లింగ్​ చేయిస్తామని చెప్పారు. ఆ బియ్యాన్ని ఎఫ్​సీఐకి సరఫరా చేసే బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తామని వివరించారు. మండల మహిళా సమాఖ్యల ద్వారా ఆర్టీసీకి అద్దెకు 600 బస్సులు కేటాయిస్తామని వెల్లడించారు. ఎస్సీ ఉపకులాల వర్గీకరణ చట్టాన్ని అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని మంత్రి భట్టి విక్రమార్క  వెల్లడించారు.
 
విద్యావ్యవస్థ బలోపేతానికి యంగ్‌ ఇండియా స్కిల్‌ వర్సిటీని తీసుకొస్తున్నామని చెబుతూ 58 యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఉండనున్నట్లు తెలిపారు. ప్రతి సాయంత్రం విద్యార్థులకు స్నాక్స్‌ పథకం అమలులోకి తీసుకొస్తామని, ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల కోసం రూ.11,600 కోట్లు కేటాయిస్తున్నట్లు మంత్రి భట్టి వెల్లడించారు.