
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి వచ్చిన బీజేవైఎం కార్యకర్తలకు మద్దతు ప్రకటించేందుకు వచ్చిన మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహేశ్వర్ రెడ్డితో పాటు బీజేవైఎం కార్యకర్తలను సైతం అరెస్ట్ చేశారు. అనంతరం మహేశ్వర్ రెడ్డిని బోయినపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
400 ఎకరాల సెంట్రల్ యూనివర్శిటీ భూమిని ప్రభుత్వం వేలం వేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ కమిషన్లు తింటున్నాడని ఆరోపించారు. గచ్చిబౌలిలోని సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ యువ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడింకి ప్రయత్నించారు.
వీరికి మహేశ్వర్ రెడ్డి మద్దతు ప్రకటించి వారితో పాటు నిరసనకు దిగారు. దాంతో మహేశ్వర్ రెడ్డిని పలువురు బీజేవైఎం కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. ఆపై అసెంబ్లీకి పోలీస్ వాహనంలో తీసుకొచ్చారు. పోలీస్ వాహనం దిగకుండా మహేశ్వర్ రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు పోలీస్ వాహనంలో ఎందుకు తిప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. అరెస్ట్ చేసిన బీజేవైఎం కార్యకర్తల్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీజేవైఎం కార్యకర్తలను, తనను పోలీసులు నిర్భంధించడంపై అసెంబ్లీ ప్రాంగణంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఇతర బీజేపీ నేతలతో కలసి నిరసనకు దిగారు. అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసనలో ఏలేటితో పాటు ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, రామారావు పటేల్, పాల్వాయి హరీష్, దన్ పాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
కాగా, సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్ పరిధిలోని 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టడాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ అసెంబ్లీ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టిన బిజెవైఎం నాయకులు, కార్యకర్తలను అరెస్ట్ చేయడాన్నిబీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాశం వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సింది పోయి, భావితరాలకు ఉపయోగపడాల్సిన యూనివర్సిటీ భూములను తెగనమ్మి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు నమ్మకద్రోహం చేస్తోందని మండిపడ్డారు.
ఇది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడమే అని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2300 ఎకరాలను యూనివర్సిటీకి కేటాయించగా, ఇప్పుడు ఆ భూములను రూ. 10 వేల కోట్ల కోసం అమ్మకానికి పెట్టడం భావితరాల విద్యా హక్కును దారుణంగా కాలరాయడమే అంటూ మండిపడ్డారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైన వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు