
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను మాజీమంత్రి, దివంగత వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డా. సునీత రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి తన తండ్రి హత్య కేసుపై ఫిర్యాదు చేశారు. వివేకాను అతి కిరాతంగా హత్య చేశారని, ఈ కేసులో తనకు న్యాయం చేయాలంటూ ఆమె విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తు వేగవంతం చేసేలా చూడాలని కోరారు.
హత్య జరిగిన నాటి నుంచి నేటి వరకూ జరిగిన పరిణామాలను ఆమె గవర్నర్‌కు వివరించారు. హత్యా జరిగి ఆరేళ్ళు అవుతున్నా నిందితులలో ఒకరు మాత్రమే జైలులో ఉన్నాడని, మిగిలిన వారంతా స్వేచ్ఛగా తిరుగుతున్నారని, సిబిఐ దర్యాప్తు గాని, కోర్టులో కేసులు గాని ముందుకు సాగడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాగా, శనివారం వైఎస్ వివేకా వర్ధంతి సందర్భంగా ముందుగా పులివెందులలో సునీత నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తన తండ్రి హత్య కేసులో సాక్షులంతా ఒక్కొక్కరిగా అనుమానాస్పద స్థితిలో మృతిచెందుతున్నారంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. హత్య జరిగి ఆరేళ్లు గడిచిపోయాయని, అయినా కేసు మాత్రం కొలిక్కి రాలేదంటూ సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత సమయం గడిచినా సీబీఐ కోర్టులో కనీసం ట్రయస్ కూడా ప్రారంభం కాలేదని ఆమె విమర్శించారు.
అత్యంత పలుకబడి కలిగిన నిందితులు ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారని ఆమె తెలిపారు. వారంతా దర్జాగా బయట తిరుగుతుంటే బాధితులమైన తాము ఆరేళ్లుగా శిక్ష అనుభవిస్తున్నట్లు ఉందని అవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీబీఐ ఈ కేసు దర్యాప్తును తిరిగి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను సునీత విజ్ఞప్తి చేశారు.
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ కేసు నీరుగార్చేందుకు చేసిన ప్రయత్నాలను గవర్నర్ దృష్టికి వైఎస్ సునీత తీసుకెళ్లారు. వైఎస్ అవినాష్‌రెడ్డిని అరెస్ట్ చేయడానికి సీబీఐ బృందాలు కర్నూలుకు వచ్చినప్పుడు నాటి సర్కార్ అండదండలతో అడ్డుకున్న తీరును ఆయనకు వివరించారు. వీటన్నింటిపైనా ఓ సమగ్ర నివేదిక అందజేశారు.
న్యాయస్థానంలో ఇప్పటివరకూ విచారణ సైతం మొదలు కాలేదని చెప్పారు. సాక్షులకు రక్షణ కల్పించాలని, అనుమానాస్పద మరణాలపై దర్యాప్తు జరిపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తమకు న్యాయం చేయాలని సునీత విన్నవించారు. ఈ కేసును సీబీఐ తిరిగి దర్యాప్తు చేపట్టాలని కోరుకుంటున్నట్లు చెప్పారు సునీత. అయితే కేసు దర్యాప్తును అడ్డుకునేందుకు కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఆమె ఆరోపించారు. సాక్షులను వాగ్మూలం వెనక్కి తీసుకోవాలంటూ నిందితులు హడలెత్తిస్తున్నారని సునీత చెప్పుకొచ్చారు.
More Stories
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి
టిడిపిలో చేరిన ముగ్గురు వైసీపీ ఎమ్యెల్సీలు
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ