విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్‌

విమానాశ్రయాల తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్‌
 
* త్రిభాషా విధానం దేశంలో కొత్తతి కాదు 

“బేగంపేట రైల్వే స్టేషన్‌లో పునరాభివృద్ధి పనులు ప్రారంభించాం. త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తాం. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నాం. రైల్వేలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.” అని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ తో కలిసి శనివారం బేగంపేట్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న పనులను పరిశీలించిన ఆయన త్వరలోనే బేగంపేట రైల్వే స్టేషన్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.

అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం వివిధ రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోందని చెప్పారు. మరో 10 శాతం పనులు పూర్తి కావాల్సి ఉందని, విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రూ.26.55 కోట్లతో మొదటి విడత పనులు జరుగుతున్నాయని, మరో రూ.12 కోట్లతో రెండో విడత పనులు పూర్తి చేస్తామని కిషన్ రెడ్డి చెప్పారు. 

ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా దశల వారీగా అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు రైల్వేస్టేషన్‌కు వస్తే ముక్కు మూసుకొని రావాల్సిన పరిస్థితి ఉండేదని, ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛభారత్ ద్వారా స్వచ్ఛ రైల్వేస్టేషన్ పేరుతో వినూత్న మార్పులను తీసుకొచ్చారని గుర్తు చేశారు. 

చర్లపల్లి రైల్వే స్టేషన్‌ని కూడా అధునాతనంగా నిర్మించుకొని ప్రారంభించుకున్నామని గుర్తు చేస్తూ బేగంపేట రైల్వేస్టేషన్‌లో అందరూ మహిళలే ఉద్యోగులు ఉండేలా చూస్తామని చెప్పారు. కాగా,  త్రిభాషా విధానం దేశంలో కొత్తతి ఏమీ కాదని, కేంద్ర ప్రభుత్వం బలవంతంగా తమపై హిందీ రుద్దుతోందని దుష్ప్రచారం చేస్తున్నారని కిషన్​రెడ్డి విమర్శించారు. 

ఏ ఒక్కరిపై కూడా బలవంతంగా హిందీని రుద్దే ప్రయత్నం చేయలేదని, ఏ భాష కావాలంటే అందులో చదువుకునే అవకాశం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. తమిళ భాషలో తీసిన సినిమాలు హిందీలో డబ్ చేసి రూ.కోట్లు లాభాలను నిర్మాతలు పొందుతున్నారని, వాళ్లకా లాభాలు ఎలా వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. భాష పేరుతో దేశాన్ని విభజించాలని చూడటం సరికాదని ఆయన హితవు చెప్పారు.

సీఎంగా స్టాలిన్ ఏం చేశాడో చెప్పి తమిళనాడు ప్రజల్ని ఓట్లు అడగాలని హితవు చెప్పారు. ఆయనేం చేయలేదు కాబట్టే భాష పేరు మీద దుష్ప్రచారం చేస్తూ ఎన్నికలు దాటేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. 

పునర్విభజనకు సంబంధించి 2009 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి విధానాలే ఇప్పటికీ కొనసాగుతున్నాయని కేంద్ర మంత్రి తేల్చి చెప్పారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై కొత్త విధానం రాలేదని, డీ లిమిటేషన్ చేస్తే సీట్లు తగ్గుతాయనేది దుష్ప్రచారం మాత్రమేనని ఆయన కొట్టిపారేశారు.