ఉక్రెయిన్, రష్యా మధ్య శాంతి నెలకొల్పేందుకు ప్రపంచ దేశాల నేతలు చేస్తున్న ప్రయత్నాల పట్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హర్షం ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్, మోదీలు నోబెల్ మిషన్ చేపట్టినట్లు ఆయన కొనియాడారు.
ఉక్రెయిన్‌తో 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరే అవకాశం ఉన్న నేపథ్యంలో పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణపై చర్చలు చేపట్టేందుకు రష్యా సిద్ధంగా ఉందని, కానీ ఆ ఒప్పందానికి ముందు షరతులపై స్పష్టత రావాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 2024 జూలైలో చేసిన ప్రతిపాదన ప్రకారం స్వల్పకాల పరిష్కారాలకు తాము అంగీకరించబోమని పుతిన్ తేల్చి చెప్పారు.
కానీ యుద్ధ సంక్షోభాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఉక్రెయిన్, రష్యా సమస్య పరిష్కారానికి అమెరికా ప్రతినిధులు కొన్ని రోజుల క్రితం సౌదీ అరేబియాలో భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్ ప్రతినిధులతో నిర్వహించిన చర్చల్లో 30 రోజల కాల్పుల విరమణ ప్రతిపాదన వచ్చింది.ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ అంశంపై నిర్ణయం తీసుకోవడానికి ముందు వివిధ దేశాధినేతలకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నట్లు పుతిన్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ ఎంతో ప్రయత్నించారని ఆయన పేర్కొన్నారు.
అన్ని దేశాలకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, కానీ చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని, బ్రెజిల్ అధ్యక్షుడు, సౌతాఫ్రికా అధ్యక్షుడు.. ఎంతో మంది దేశాధినేతలు ఉక్రెయిన్ సమస్య పరిష్కారం కోసం ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నారని ఆయన తెలిపారు. శాంతి కోసం కృషి చేసినవారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు పుతిన్ తెలిపారు.
ఓ మంచి లక్ష్యం కోసం నేతలందరూ పనిచేస్తున్నారని, యుద్ధాన్ని నివారించేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రాణ నష్టం జరగకుండా చూస్తున్నారని పుతిన్ తెలిపారు. అయితే, దీర్ఘకాలిక శాంతి ఏర్పడే అవకాశం ఉంటేనే ఉక్రెయిన్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తామని పుతిన్ స్పష్టం చేశారు.
ఉక్రెయిన్‌తో యుద్ధం మొదలైన తర్వాత ప్రధాని మోదీ పలు మార్లు పుతిన్, జెలెన్‌స్కీతో మాట్లాడారు. గత నెలలో వైట్‌హౌజ్‌లో ట్రంప్‌తోనూ ఈ అంశంపై మోదీ భేటీ అయ్యారు. రష్య, ఉక్రెయిన్ సంక్షోభంలో భారత్ తటస్థంగా ఉన్నట్లు చెప్పారు. ఇది యుద్ధం జరిపే యుగం కాదు అని, ట్రంప్ తీసుకునే చర్యను సమర్థిస్తున్నట్లు కూడా మోదీ పేర్కొన్నారు.
More Stories
ఆసియాకప్‌లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
సొంత ప్రజలపై పాక్ బాంబులు.. 30 మంది మృతి
కెనడాలో ఖలీస్థానీ ఉగ్రవాది ఇంద్రజీత్ సింగ్ గోసల్ అరెస్ట్