
* ఘర్షణలతో ఒకరు మృతి, 25 మందికి గాయాలు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే మణిపూర్‌లో కుకీ మహిళలపై భద్రతా దళాలు దాడికి పాల్పడ్డారు. గత ఏడాదిన్నరగా జాతుల ఘర్షణలతో రగులుతున్న మణిపూర్‌లో శనివారం నుంచి ఫ్రీ మూమెంట్ అమల్లోకి వచ్చింది. అయితే తమకు ప్రత్యేక పరిపాలన వచ్చేంతవరకు స్వేచ్ఛగా తిరిగేందుకు అనుమతించవద్దని కుకీలు డిమాండ్ చేస్తూ కాంగ్‌పోక్సి జిల్లాలో నిరసనలు చేశారు.
కాంగ్‌పోక్పి జిల్లాలో కుకి ఆందోళనకారులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఘర్షణల్లో నిరసనకారుడు మృతి చెందాడు. 25 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. క్షతగాత్రుల్లో మహిళలు కూడా ఉన్నారని చెప్పారు. బులెట్ గాయంతో మరణించిన వ్యక్తిని లాల్‌గౌతాంగ్ సింగ్సిట్ (30)గా గుర్తించారు.
కొన్ని ప్రాంతాల్లో రవాణా బస్సులను నిరసనకారులు అడ్డుకున్నారు. వాహనాలపైకి రాళ్లు రువ్వారు. పలుచోట్ల రోడ్లను దిగ్బంధించారు. గో బ్యాక్ అని నినాదాలు చేశారు. అయితే కుకీ నిరసనకారులను భద్రతా దళాలు చెదరగొట్టేందుకు ప్రయత్నించాయి. దీంతో నిరసనకారులకు, భద్రతా దళాల మధ్య ఘర్షణలు జరిగాయి.
నిరసనకారులను చెదరగొట్టేందుకు పలుచోట్ట భద్రతాదళ సిబ్బంది లాఠీచార్జ్ చేశారు. ఈ ఘర్షణల్లో కొంతమంది కుకీ మహిళలకు గాయాలయ్యాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజునే గాంగిఫై, కాంగ్‌పోక్పి జిల్లాలో నిరసన చేసిన కుకీ మహిళలు క్రూరమైన హింసను ఎదుర్కొన్నారు. పురుష భద్రతా దళాలు శాంతియుతంగా నిరసన చేస్తున్న కుకీ మహిళలపై కనికరం లేకుండా దాడి చేశారు. బలప్రయోగం ద్వారా శాంతిని ఎప్పటికీ సాధించలేము అని ఈ ఘర్షణలకు సంబంధించిన వీడియో మణిపూర్‌లో ఈ హింసను ఆపండి అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అవుతున్నాయి.
మరోవైపు మణిపూర్‌లో ఏడాదిన్నరపైగా మైతీ, కుకీ జాతుల మధ్య ఘర్షణలు కొనసాగాయి. వందలాది మంది మరణించారు. ఇళ్లు కోల్పోయిన వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారి కోసం భద్రతా దళాల రక్షణలో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ జాతుల ఘర్షణల నేపథ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్‌సింగ్ తన పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ