మైనర్లపై అత్యాచారాలకు శిక్ష విధించినట్లే, బాలికలను బలవంతంగా మతం మార్చిన వారికి ఉరిశిక్ష విధించేలా త్వరలోనే చట్టాన్ని తీసుకొస్తామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకటించారు. మత స్వేచ్ఛ చట్టంలోనే ఉరిశిక్ష నిబంధన ఉంటుందని తెలిపారు. భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో పాల్గొన్న ఆయన అతివలపై నేరాలకు పాల్పడేవారి పట్ల తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.
మహిళా దినోత్సవం సందర్భంగా తన కార్యాలయ నిర్వహణను సీఎం మోహన్ యాదవ్ వనితలకు అప్పగించారు. అక్రమ మతమార్పిడుల వెనుక ఉన్నవారిని కూడా తమ ప్రభుత్వం విడిచిపెట్టదని మోహన్ యాదవ్ తీవ్రంగా హెచ్చరించారు. దుష్ట ఆచారాలు, తప్పుడు వ్యవహారాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.
“మా అమాయక కుమార్తెలపై దారుణాలకు పాల్పడే వారిపై మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. వారిని బలవంతం చేసే వారిని మేం వదిలిపెట్టం. అలాంటి వారిని జీవించడానికి అనుమతించకూడదు. బలవంతపు మత మార్పిడులు చేసే వారికి మరణశిక్ష విధించే నిబంధన మత స్వేచ్ఛ చట్టంలో చేర్చడానికి మేం కృషి చేస్తున్నాం” అని తెలిపారు.
మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఆడబిడ్డల రక్షణ, ఆత్మ గౌరవానికి అంకితమై ఉందని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. భోపాల్‌లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం, మహిళలకు నెలవారీ ఆర్థిక సాయం అందించే పథకం ‘లాడ్లీ బెహ్నా యోజన’ కింద 1.27 కోట్లకు పైగా లబ్దిదారుల ఖాతాల్లోకి రూ.1,552.73 కోట్లను డిజిటల్‌గా బదిలీ చేశారు.
అంతేకాదు ఎల్‌పీజీ సిలిండర్ రీఫిల్ పథకం కింద 26 లక్షలకు పైగా లబ్దిదారులకు రూ.55.95 కోట్ల గ్రాంట్‌ను బదిలీ చేశారు. ఈ పథకం కింద నెలకు సిలిండర్‌కు రూ.450 సబ్సిడీ అందిస్తారు.
కాగా, ‘లవ్ జిహాద్’గా పేర్కొనే బలవంతపు మత మార్పిడులపై బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన వైఖరిని అవలంబిస్తున్నాయి. ఇందులో భాగంగా 2021 మార్చి 8న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో మత స్వేచ్ఛ చట్టాన్ని ఆమోదించారు. అక్రమ మత మార్పిడులకు పాల్పడిన వారికి పదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.50,000 వరకు జరిమానా విధించే నిబంధన ఈ చట్టంలో ఉంది. అలాగే ఈ చట్టాన్ని ఉల్లంఘించి జరిగే ఏ వివాహం కూడా చెల్లుబాటు కాదు.

More Stories
ఆర్ఎస్ఎస్ లక్ష్యం దేశాన్ని నిర్మించడమే
ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చూస్తాం
ఎస్పీ నేత ఆజంఖాన్, అబ్దుల్లా ఆజంలకు ఏడేళ్ల జైలుశిక్ష