రాయచోటిలో పార్వేట ఉత్సవంలో హిందువుల పై దాడులు

రాయచోటిలో పార్వేట ఉత్సవంలో హిందువుల పై దాడులు

అన్నమయ్య జిల్లా రాయచోటిలో మార్చి 4వ తేదీన జరిగిన  వీరభద్ర స్వామి ఆలయ పార్వేట ఉత్సవం సందర్భంగా భక్తులు ఊరేగింపు చేస్తుండగా ముస్లింలు హిందువులపై జరిపిన దాడిని విశ్వహిందూ పరిషత్ తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా పోలీసులు ముస్లింలను అదుపు చేయడంలో విఫలమవడమేకాకుండా, పక్షపాత ధోరణితో హిందువులపైనే అమానుషంగా లాఠీచార్జిచేసి వారిని తీవ్రంగా గాయపరిచారని అంటూ పరిషత్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
ప్రతి సంవత్సరం చేసుకునే ఉత్సవంలాగే ఈ సంవత్సరం కూడా  హిందువులు ఉత్సవం జరుపుకుంటుంటే ముస్లింలు  దాడి చేయడం, దానికి పోలీసులు తగు రక్షణ చర్యలు చేపట్టక పోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాయచోటిలో ఊరేగింపు జరుపుకొనుటకు అన్ని అనుమతులు తీసుకొని ఉత్సవాన్ని నిర్వహించుకుంటుంటే ఆ ఉత్సవానికి ఆటంకాలు కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులది కాదా అని ప్రశ్నించారు.  
 
పైగా, ప్రశాంతంగా తమ ఉత్సవాలు తాము  నిర్వహించుకునే హిందువులను,  హిందూ సంస్థలను బాధ్యుల్ని చేస్తూ కేసులు పెట్టడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. హిందువులపైన, వారి ఉత్సవాలపైన ముస్లింలు దాడులు చేయడం రాష్ట్రంలో ఇదే తొలిసారి కాదని, గత సెప్టెంబరులో చిత్తూరు జిల్లలోని వి.కోటలో, కృష్ణా జిల్లాలోని పెడనలో కూడా ఇలాగే దాడులు చేశారని విమర్శించారు.
 
హిందువులపైనే కాకుండా, పోలీసులు పైన, పోలీస్ స్టేషన్ల పైన కూడా ముస్లింలు దాడులు చేస్తుంటే వారి మానసిక స్థితిని పోలీసులు గుర్తించకపోగా, దాడులు జరిగిన ప్రతిసారీ హిందువులను బాధ్యులు చేసే ప్రయత్నం చేయడం పోలీసుల వైఫల్యం మాత్రమే అని పరిషత్ స్పష్టం చేసింది.

ఈ సంఘటన జరిగిన సందర్భంలో రాయచోటి అర్బన్ స్టేషన్ ఎస్ ఐ ప్రవర్తన హిందువులను రెచ్చగొట్టే  రవికుమార్ ఆరోపించారు. సంఘటన జరిగిన సందర్భంలో స్త్రీలను, వృద్ధులను, భక్తులను నిందాపూర్వకంగా మాట్లాడడమే కాకుండా, వారిపై లాఠీచార్జి చేసి  తీవ్రంగా కొట్టారని తెలిపారు.  ఒక పథకం ప్రకారం  హిందువులపై దాడి చేసి తిరిగి హిందువులను, హిందూ సంస్థలను కేసుల్లో ఇరికించే కుట్ర చేయడం ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం చేసిన పక్షపాత చర్యగా  స్పష్టం చేశారు. పక్షపాతంగా వ్యవహరించిన ఎస్ ఐ ను వెంటనే విధుల నుండి తొలగించి, సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 
పెడనలో పోలీసులపైనే దాడులు చేసి, వారిని గాయాలపాలు చేసినా వారిపై చర్యలు తీసుకునే ధైర్యం పోలీసులకు లేక, వాట్సాప్ లో ఆ సమాచారం  పెట్టారని పేర్కొంటూ  హిందువులపై కేసులు పెట్టే ప్రయత్నం చేసిన పోలీసుల తీరును హిందూ సమాజం ఇంకా మర్చిపోలేదని హెచ్చరించారు. అదే విధంగా వి.కోటలో కూడా దాడికి గురైన హిందువులని దోషులుగా చేస్తూ వారి పైన కేసులు నమోదు చేశారని తెలిపారు. 
 
అదే సందర్భంలో నెల్లూరులో పోలీస్ స్టేషన్ పై దాడి,  గుంటూరులో పోలీస్ స్టేషన్ దగ్ధం చేసినటువంటి వ్యక్తులపై కేసులు నమోదు చేయకపోవడం, పెట్టిన   కేసులు ఉపసంహరించుకోవడం పోలీసుల  పక్షపాత ధోరణికి  ఉదాహరణలుగా రవి కుమార్ స్పష్టం చేశారు. హిందువుల ఉత్సవాలు ఊరేగింపులు సందర్భంగా ముస్లింలు హిందువులపై  దాడులు చేస్తారనే భయంతో హిందువుల ఉత్సవాలపై రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు పెట్టడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 
రాయిచోటిలో  హిందువులు ఏ నినాదాలు పలకాలి, ఎవరు ఉత్సవంలో పాల్గొనాలి అని పోలీసులే పేర్కొనడం నియమాలకు విరుద్ధం అని విమర్శించారు. పెడనలో చుట్టుపక్కల గ్రామాల నుంచి దాడి చేయడానికి వచ్చినప్పుడు స్పందించని పోలీసులు, భగవంతుని ఉత్సవం కోసం రాయచోటిలో పరిసర గ్రామాలనుంచి భక్తితో పార్వేట ఉత్సవంలో భక్తులు పాల్గొంటే మీకు రాయిచోటి రావాల్సిన అవసరం ఏమిటని పోలీసులు ప్రశ్నించడం వారి అధికార దుర్వినియోగమే అంటూ స్పష్టం చేసింది.
 
ఈ సందర్భంగా సక్రమంగా ఉత్సవ రక్షణ విధులు నిర్వర్తించని, బాధిత హిందువులపై తప్పుడు కేసులు పెట్టిన ఎస్ ఐని వెంటనే సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకోవాలని, హిందువులపై పెట్టిన కేసులు ఉపసంహరించు కోవాలని, ఉత్సవంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈనెల 10వ తేదీన అన్ని జిల్లా కలెక్టర్  కార్యాలయాల ముందు పెద్ద సంఖ్యలో హిందువులందరూ పాల్గొని నిరసన ధర్నా నిర్వహించాలని పరిషత్ పిలుపిచ్చింది. ఆ తర్వాత జిల్లా కలెక్టర్ ల ద్వారా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిలకు వినతి పత్రాలు సమర్పించాలని యావత్ హిందూ సమాజానికి విజ్ఞప్తి చేసింది.