
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి మార్పు జరుగుతుందన్న ఊహాగానాలను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర విభాగం మాజీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి తోసిపుచ్చారు. మరో విడత సీఎంగా నితీష్ కుమార్‌కు బీజేపీ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ ఏడాది చివర్లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండగా నితీష్ స్థానే కొత్త నేతను ఎంచుకునే అవకాశం ఉందని కొద్దికాలంగా బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వివరణ ఇచ్చారు.
బీహార్‌లో ఎన్డీయేకు 1996 నుంచి నాయకత్వం వహిస్తు్న్న నితీష్‌కు బాసటగా బీజీపీ నిలుస్తుందని సమ్రాట్ చౌదరి శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ”నిన్న ఆయనే నాయకుడు, నేడు కూడా ఆయనే నాయకుడు. రేపటి నాయకుడు కూడా ఆయనే” అని చౌదరి తెలిపారు.
ఇంతవరకు రాజకీయ జీవితానికి దూరంగా ఉంటున్న నితీష్ కుమారుడు నిశాంత్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలపై చౌదరి మాట్లాడుతూ, అది పూర్తిగా జేడీయూకు, నితీష్‌కు చెందిన అంతర్గత వ్యవహారమని చెప్పారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా భాగస్వామ్య పార్టీగా వారికి తమ మద్దతు ఉంటుందని తేల్చి చెప్పారు.
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మద్దతుతో ముఖ్యమంత్రి స్థాయికి నితీష్ కుమార్ ఎదిగారని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా కేంద్రంలో నితీష్ పొత్తు సాగిస్తున్నారని చౌదరి చెప్పారు. జాతీయ స్థాయిలో మోదీజీ నాయకత్వంలో నితీష్ పనిచేస్తుండగా, బీహార్‌లో నితీష్ తమ నాయకుడిగా ఉన్నారని వివరించారు.
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు గాను 200కు పైగా సీట్లు ఎన్డీయే గెలుచుందని, బీహార్‌లో డబుల్ గవర్నర్‌మెంట్ మోడల్ సాధించిన విజయాలు తమకు ఘనవిజయాన్ని అందిస్తాయని జోస్యం చెప్పారు. లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) నాయకుడు, మరొక ఎన్డీఏ మిత్రుడు చిరాగ్ పాస్వాన్ గురించి అడిగినప్పుడు, చౌదరి హాజీపూర్ యువ ఎంపీని ప్రశంసించారు, ఆయనను “సంకీర్ణాన్ని బలోపేతం చేసే గొప్ప నాయకుడు” అని అభివర్ణించారు.
కాగా, ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్ కేవలం ఆయన తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ నామినీ మాత్రమేమని, ఆయన నుంచి ఎన్డీయేకు వచ్చే సవాలు ఏదీ ఉండదని మరో ప్రశ్నకు సమాధానంగా చౌదరి చెప్పారు.
”తేజస్వి చిన్నపిల్లోడని నేను ఎప్పుడూ చెబుతుంటాను. పార్టీకి నియామకం జరపాలని లాలూ అనుకున్నప్పుడు తేజస్వి గురించి ఎవరూ మాట్లాడుకున్న వారే లేరు” అని పేర్కొన్నారు. ఆర్జేడీ 15 ఏళ్ల పాలనలో చీకటి రోజులు, హింస గురించి అందరికీ తెలిసిందేనని, చివరకు లాలూ ప్రసాద్ కుమార్తె వివాహ వేడుకలోనూ దొంగతనం జరగడం అందరికీ గుర్తుందని చెప్పారు.
చౌదరి తేజస్వి యాదవ్ చేస్తున్న ప్రజాకర్షణ వాగ్దానాలను ఎగతాళి చేస్తూ, ఆయన వైఖరిలోని వైరుధ్యాలను ఎత్తి చూపారు. “మధ్య నిషేధం విధించినప్పుడు ఆర్జేడీ అధికారంలో ఉంది.కానీ ఇప్పుడు వారు కల్లుగీత కార్మికులకు ఉపశమనం అందించడం గురించి మాట్లాడుతున్నారు. ఆర్జేడీ అధికారంలో ఉన్నప్పుడు తేజస్వి వాగ్దానాలే రద్దు చేశారు” అని చౌదరి ఎద్దేవా చేశారు.
ఉప ముఖ్యమంత్రిగా తన పదవీకాలం గురించి తేజస్వి చేసిన వాదనలను చౌదరి ప్రస్తావిస్తూ, వాటిని తోసిపుచ్చారు, “తేజస్వి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సాధించిన విజయాల గురించి గొప్పలు చెప్పుకుంటాడు. నిజమైన అధికారాలన్నీ ముఖ్యమంత్రి వద్ద ఉన్నాయని అతనికి తెలియదు. అతని విశ్వాసం అతని తండ్రి పార్టీ నుండి వస్తుంది, కానీ ఎన్నికలు అతనికి ఇది ఒక వారసత్వ రాజకీయం పాలించే రాచరికం కాదని నేర్పుతాయి” అని చెప్పారు.
More Stories
‘మోహన్‌లాల్’కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
ట్రంప్ వీసా రుసుం పెంపుపై భారత్ అత్యవసర నంబర్!
ఆర్థిక మాంద్యం ముప్పు దిశగా అమెరికా