యుపి అసెంబ్లీ పరిసరాల్లో గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధం

యుపి అసెంబ్లీ పరిసరాల్లో గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధం
ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ పరిసరాల్లో గుట్కా, పాన్‌ మసాలాలపై నిషేధం విధిస్తూ స్పీకర్‌ సతీష్‌ మహనా బుధవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘అసెంబ్లీ పరిసరాల్లో గుట్కా, పాన్‌ మసాలా తినడం నిషిద్ధం. ఈ నిర్ణయం ఈ క్షణం నుంచే అమల్లోకి వస్తుంది. ఎవరైనా ఈ నిబంధనను ఉల్లంఘిస్తే రూ.1000 జరిమానా విధించబడుతుంది. జరిమానాతోపాటు నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకోబడుతాయి’ అని స్పీకర్ సతీష్‌ మహనా చెప్పారు.

మంగళవారం అసెంబ్లీ హాల్లోని కార్పెట్‌పై ఓ ఎమ్మెల్యే ఉమ్మివేశాడు. ఈ విషయం తెలుసుకున్న స్పీకర్‌ సిబ్బందితో కలిసి ఆ ఉమ్మిని శుభ్రం చేశారు. అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ ఈ విషయంపై సీరియస్‌ అయ్యారు. అసెంబ్లీలో ఇలా ఉమ్మివేయడం మంచిపని కాదని హితవు చెప్పారు.  కార్పెట్‌పై ఉమ్మిన ఎమ్మెల్యేను తాను వీడియోలో చూశానని, కానీ ఆయన పరువు తీయకూడదనే ఉద్దేశంలో పేరు వెల్లడించడం లేదని చెప్పారు. సదరు ఎమ్మెల్యే తనకు తానుగా తన ఛాంబర్‌కు వచ్చి వివరణ ఇవ్వాలని, లేదంటే తానే పిలిపించి మాట్లాడాల్సి వస్తుందని వార్నింగ్‌ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో గుట్కా, పాన్‌ మసాలాపై నిషేధం విధిస్తున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్‌ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగానే ఓ ఎమ్మెల్యే అసెంబ్లీ హాల్లో పాన్‌ మసాలా నమిలి ఉమ్మడం, పర్యవసానంగా అసెంబ్లీ పరిసరాల్లో గుట్కా, పాన్‌మసాలాపై స్పీకర్‌ బ్యాన్‌ విధించడం చకచకా జరిగిపోయాయి.