ఎమ్మెల్యేల ఫిరాయింపులపై తెలంగాణ ప్ర‌భుత్వానికి `సుప్రీం’ నోటీసులు

ఎమ్మెల్యేల ఫిరాయింపులపై  తెలంగాణ ప్ర‌భుత్వానికి `సుప్రీం’ నోటీసులు
బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల అనర్హతపై మరోసారి సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ప్రభుత్వ వైఖరిపై గర్హించిన సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల‌పై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దాఖ‌లు చేసిన పిటిష‌న్ల‌పై విచారణ జరపగా ఇప్ప‌టి వ‌ర‌కు కోర్టు నుంచి త‌మ‌కు నోటీసులు రాలేద‌ని ప్ర‌తివాదుల త‌ర‌పు న్యాయ‌వాదులు కోర్టుకు తెలిపారు. 
 
ప్ర‌తివాదుల వాద‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి, జ‌స్టిస్ అగ‌స్టిన్ జార్జ్ ధ‌ర్మాస‌నం రాష్ట్ర ప్ర‌భుత్వం, అసెంబ్లీ కార్య‌ద‌ర్శి స‌హా ప్ర‌తివాదులంద‌రికీ నోటీసులు జారీ చేసింది. పిటిష‌న్‌పై త‌దుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25వ తేదీకి ధ‌ర్మాస‌నం వాయిదా వేసింది. 22వ తేదీలోపు కౌంట‌ర్లు దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

ఈ సంద‌ర్భంగా జ‌స్టిస్ బీఆర్ గ‌వాయి మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం, స్పీకర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రతిసారీ రీజనబుల్ టైమ్ కావాలని ప్రభుత్వం కోరుతుండటంతో సుప్రీంకోర్టు మండిపడింది. రీజనబుల్ టైమ్ అంటే గడువు ముగిసే వరకా అని అసహనం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య విధానాలు ఏం కావాలని ప్రశ్నించింది. 

ఇంకా ఎంత సమయం కావాలో చెప్పాలని కోరింది. ‘ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్’ అనే తీరు మంచిది కాదని జస్టిస్ బిఆర్ గవాయి చెప్పారు. బీఆర్ఎస్ త‌ర‌పున సీనియ‌ర్ న్యాయ‌వాది ఆర్య‌మ సుంద‌రం వాదిస్తూ  ప్రతిసారీ కావాలనే ఆలస్యం చేసే ఎత్తుగడలు అనుసరిస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. తమ పార్టీ ఎంఎల్ ఎలు పార్టీ మారారంటూ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఏడాది గడిచిందని, ఇదే అంశంపై తెలంగాణ హైకోర్టులో కూడా విచారణ జరిగిందని వివరించారు