
* రష్యాకు వ్యతిరేకంగా సైబర్ సమరం ఆపండి
అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాకు అనుకూల వైఖరిని ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా అధ్యక్షుడు పుతిన్ కంటే అక్రమ వలసదారుల తోనే ముప్పు ఎక్కువని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్రూత్ సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టారు.
“మనం పుతిన్ గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన పనిలేదు. మనదేశంలోకి ప్రవేశించే రేప్ గ్యాంగ్స్, డ్రగ్ లార్డ్, హంతకులు, మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిపైనే ఎక్కువగా దృష్టి సారించాలి. అప్పుడే మనకు ఐరోపా లాంటి పరిస్థితి ఉండదు ” అని ట్రంప్ వ్యాఖ్యలు చేశారు.
ఫిబ్రవరిలో కేవలం 8326 మంది అక్రమ వలసదారులు మాత్రమే దేశ సరిహద్దుల్లో పట్టుబడ్డారని ట్రంప్ తెలిపారు. జో బైడెన్ అధికారంలో ఉన్న సమయంలో ప్రతినెలా దేశం లోకి మూడు లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని గుర్తు చేశారు. ఈ గణాంకాలకు సంబంధించి సీబీపీ విడుదల చేసిన నివేదికలను ఉటంకించారు. దాదాపు 95 శాతం వలసలు తగ్గినట్టు వెల్లడించారు.
తన పాలనలో ఎవరైనా చట్ట విరుద్ధంగా దేశం లోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తే పెద్ద మొత్తంలో జరిమానాలు, తక్షణ బహిష్కరణను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అయితే, ట్రంప్ ప్రకటనను పలు వార్తా సంస్థలు తప్పు పట్టాయి. ఆయన చూపిన గణాంకాలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని దుయ్యబట్టాయి.
అమెరికా కస్టమ్స్, బోర్డర్ ప్రొటెక్షన్ విడుదల చేసిన డేటాను ఫాక్స్ న్యూస్ పంచుకుంది. బైడెన్ అధికారంలో ఉన్న చివరి వారంలో దాదాపు 20,086 మంది అక్రమ వలసదారులను గుర్తించినట్లు పేర్కొంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలో 7287 మంది పట్టుబడ్డారని వెల్లడించింది. అయితే అధ్యక్షుడు పేర్కొన్నారు ఈ సంఖ్యలో గణనీయమైన తగ్గుదల అనటం నిజం కాదని, కేవలం 65 శాతం మాత్రమే తగ్గాయని తెలియజేసింది.
మరోవంక, రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ రష్యాకు వ్యతిరేకంగా చేపడుతోన్న సైబర్ కార్యకలాపాలన్నీ నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ నిలిపివేత ఎంతకాలం కొనసాగుతుందన్న దానిపై మాత్రం స్పష్టత లేదు. ఈ మేరకు స్థానిక మీడియాలో కథనాలు వచ్చాయి. ఉక్రెయిన్- రష్యాల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని నిలువరించేందుకు మధ్యవర్తిగా ట్రంప్ వ్యవహరిస్తున్నారు.
అయితే ఈ విషయంలో పుతిన్‌కు అనుకూలంగా, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని నిందిస్తుండటం చర్చనీయాంశ అవుతోంది. ఇటీవల జెలెన్‌స్కీతో శ్వేతసౌధంలో జరిగిన భేటీలో కూడా మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్య పరిచింది. ఈ క్రమంలో రష్యా విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాలను ట్రంప్ యంత్రాంగం పునః సమీక్షిస్తున్నట్టు తాజాగా ఓ కథనం వెలువడింది. దీనిపై స్పందించేందుకు పెంటగాన్ నిరాకరించింది. సైబర్ ఇంటెలిజెన్స్ లోని ముఖ్యమైన సమాచారాన్ని తాము బహిరంగంగా పంచుకోలేమని తెలిపింది.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము