ట్రంప్- జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధంలో తీవ్ర వాగ్యుద్ధం

ట్రంప్- జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధంలో తీవ్ర వాగ్యుద్ధం
* ఖనిజ ఒప్పందం లేకుండానే అర్ధాంతరంగా ముగిసిన భేటీ
 
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మధ్య శ్వేతసౌధంలో తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. శుక్రవారం ఇరువురు నేతలు ఓవల్‌ ఆఫీసులో 45 నిమిషాల పాటు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. అర్ధాంతరంగా వారి భేటీ ముగిసింది.

డొనాల్డ్‌ ట్రంప్‌, జెలెన్‌స్కీ మధ్య మీడియా ఎదుటే మాటల యుద్ధం చోటు చేసుకుంది. ‘మాతో ఒప్పందం కుదుర్చుకుంటే సరే- లేదంటే మీ దారి మీరు చూసుకోండి’ అని ట్రంప్‌ తెగేసి చెప్పారు. రష్యా చేస్తున్న యుద్ధానికి తెర దించడానికి శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని అమెరికా చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం శ్వేతసౌధానికి వచ్చారు. 

భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పించాలని ఆయన ఒత్తిడి చేశారు. ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌లకు ఇది ఆగ్రహం తెప్పించింది. ఉక్రెయిన్‌ అతిపెద్ద సమస్యల వలయంలో చిక్కుకుందని, దీని నుంచి గట్టెక్కడం అసాధ్యమని ట్రంప్‌ హెచ్చరించారు. దీనికి జెలెస్కీ కూడా అంతే స్థాయిలో బదులిచ్చారు.

“మా దేశంలో మేం ఉంటున్నాం. దృఢసంకల్పంతో ఉన్నాం. ఎవరికీ తలవంచే ప్రసక్తే లేదు. అయినా, మాకు మీ మద్దతు ఉన్నందుకు కృతజ్ఞతలు” అని చెప్పారు. ఈ క్రమంలోనే ఇరువురు నేతల మధ్య వాగ్వాదం జరిగింది. ఉక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో జెలెస్కీ వ్యవహార శైలి సరికాదని, చాలా విషయాలను ఇది క్లిష్ట తరం చేస్తుందని ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘మీరు కోట్లాది మంది ప్రజల ప్రాణాలతో జూదం ఆడుతున్నారు’ అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అమెరికాను అగౌరవపరిచారని మండిపడ్డారు. అమెరికా శాంతి నిబంధనలకు అంగీకరించాలని ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ వ్యాఖ్యలకు జెలెన్‌స్కీ సమాధానం ఇచ్చిన తర్వాత నేతల మధ్య ఈ గొడవ మొదలైంది. 
 
జెలెన్‌స్కీ సమాధానం ఇవ్వబోగా ‘మీకు మాట్లాడడానికి అనుమతి లేదు’ అని ట్రంప్‌ తేల్చి చెప్పారు. దానికి జెలెన్‌స్కీ యుద్ధం మొదలైనప్పుడు తాము ఒంటరిగానే ఉన్నామని బదులిచ్చారు.  ఇరువురు నేతల మధ్య తీవ్ర వాగ్వాదంతో ప్రెస్‌మీట్‌ మధ్యలోనే జెలెన్‌స్కీ వెళ్లిపోయారు. ఓవెల్‌ ఆఫీసులో అమెరికా అధ్యక్షుడు, మరో దేశాధ్యక్షుడి మధ్య జరిగిన అతిపెద్ద వాగ్వాదం ఇదే కావడం విశేషం.

“లక్షలాది మంది జీవితాలతో మీరు చెలగాటమాడుతున్నారు. మీ వ్యవహార శైలితో మూడో ప్రపంచయుద్ధం వచ్చేలా ఉంది. మీరు చేస్తున్న పనులతో దేశానికి చాలా చెడ్డపేరు వస్తోంది” అని జెలెన్‌స్కీని ఉద్దేశించి ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ కలగజేసుకున్నారు. గట్టిగా మాట్లాడొద్దని జెలెన్‌స్కీకి హితవుపలికారు. 

రెండు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలంటే దౌత్యం అవసరమని చెప్పారు. ఎలాంటి దౌత్యం? అంటూ జెలెన్‌స్కీ ఎదురు ప్రశ్నించారు. దీంతో వాన్స్‌ ఒకింత అసహనానికి గురయ్యారు. అధ్యక్షుడి కార్యాలయంలో ఇలా ప్రవర్తించడం సరికాదని హితవు చెప్పారు. వెంటనే వాన్స్‌కు మద్దతుగా ట్రంప్‌ మాటలు అందుకున్నారు. “మీకు 350 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయం చేశాం. ఆయుధాలు సమకూర్చాం. ఊహించని స్థాయిలో మద్దతుగా నిలిచాం. మా సైనిక పరికరాలే లేకపోతే రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం 2 వారాల్లో ముగిసిపోయేది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మధ్యలో కలగజేసుకున్ను జెలెన్‌స్కీ “అవునవును.. నిజమే. రెండు రోజుల క్రితం ఇదే మాటలు పుతిన్‌ కూడా అన్నారు” అని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా అవాక్కయిన ట్రంప్‌ ఆ వాగ్వాదానికి ముగింపు పలుకుతూ ఇలాంటి పరిస్థితుల్లో ఉక్రెయిన్‌తో వాణిజ్యసంబంధాలు నెరపడం కష్టమని వ్యాఖ్యానించారు.

అయితే, అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు జేడీ వాన్స్‌ ఓ అడుగు ముందుకేశారు. “భిన్న అభిప్రాయాలు ఉండటం సహజమే. వాటిపై న్యాయపోరాటం చేయాలి. అంతేతప్ప మీడియా ఎదుట ఇలా ప్రవర్తించడం సరికాదు’’ అని ఒకింత మందలించారు.  వెంటనే ట్రంప్‌ కలగజేసుకుంటూ ఇక్కడ ఏం జరుగుతుందో అమెరికా ప్రజలందరికీ తెలియడం ఒక విధంగా మంచిదే. అందుకే ఈ విషయాన్ని ఇంత వరకు బయటకు చెప్పలేదు. నిజమేంటో ఇప్పుడు ప్రజలందరికీ అర్థమవుతుంది. మేం చేసిన సాయానికి మీరు కృతజ్ఞులుగా ఉండాలి. అంతేతప్ప ఇలా ప్రవర్తించడం సరికాదు’’ అని హితవు చెప్పారు.

“ఎంతో మంది ప్రజలు చనిపోతున్నారు. మీ దగ్గర సైనిక బలగం కూడా తగ్గిపోయింది. అయినా మాకు శాంతి ఒప్పందం వద్దంటున్నారు. యుద్ధమే చేస్తామంటున్నారు. తక్షణమే శాంతి ఒప్పందానికి పచ్చజెండా ఊపాల్సిన అవసరం ఉంది. అప్పుడే మీ దేశంపై బుల్లెట్ల మోత ఆగుతుంది. మరణాలు ఆగుతాయి” అని ట్రంప్‌ కాస్త తీవ్ర స్వరంతోనే హెచ్చరించారు. 

దీనిపై జెలెన్‌స్కీ స్పందిస్తూ, శాంతి ఒప్పందం గురించి మీ గత ప్రభుత్వనేతలను అడగండి. ఏం చెబుతారో వినండి అన్నారు. దీనికి సమాధానంగా గతంలో బైడెన్‌ ఉండేవారు అయన అంత స్మార్ట్‌ కాదు అంటూ ట్రంప్‌ బదులిచ్చారు. ఈ నేపథ్యంలో జెలెన్‌స్కీ అమెరికాతో ఖనిజాల ఒప్పందంపై సంతకం చేయకుండానే అక్కడి నుంచి వెనుదిరిగారు.

తొలుత శ్వేతసౌధంలో జెలెన్‌స్కీకి ఎదురెళ్లి మరీ ట్రంప్‌ ఆహ్వానం పలికారు. ఇద్దరూ కరచాలనం చేసుకొని లోనికి వెళ్లారు. రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలంటే ఉక్రెయిన్‌ చాలా విషయాల్లో రాజీ పడాల్సి ఉంటుందని ట్రంప్‌ చెప్పారు. అవసరమైతే కొంత భూభాగాన్ని కూడా రష్యాకు ఇవ్వాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు.

రాజీలు లేకుండా ఎలాంటి ఒప్పందాలూ జరగవని స్పష్టం చేశారు. అమెరికన్‌ కంపెనీలకు ఉక్రెయిన్‌లోని విలువైన ఖనిజ వనరులను అప్పగించే ఒప్పందంపై సంతకం చేయాలని చెప్పారు. భవిష్యత్తులో అమెరికా మద్దతు అనేది దీనిపైనే ఆధారపడి ఉంటుందని చెప్పారు. ఈ షరతుపై జెలెన్‌స్కీ ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాలకు సంబంధించిన ఒప్పందంతో ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలకు మేలు చేకూరుతుందని ట్రంప్‌ పేర్కొన్నారు. 

అయితే పుతిన్‌ ఓ హంతకుడని, ఆయనతో రాజీ పడే ప్రసక్తే లేదని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. యుద్ధ సమయంలో రష్యా సైనికుల అకృత్యాలకు సంబంధించిన ఫొటోలను ట్రంప్‌కు చూపించారు. ‘మా భూమి కోసం హంతకుడితో ఎలాంటి రాజీ పడబోం’ అని జెలెన్‌స్కీ స్పష్టం చేశారు. అధ్యక్షుడు ట్రంప్‌ తమవైపే ఉన్నారని విశ్వాసం వ్యక్తం చేశారు. 

ట్రంప్‌ స్పందిస్తూ తాను శాంతిదూతగా గుర్తుండిపోవాలని ఆశిస్తున్నానని తెలిపారు. ‘‘నేను ఇదంతా చేస్తున్నది ప్రాణాలను కాపాడేందుకే తప్ప మరో కారణం లేదు. ఇలాగే వదిలేస్తే మూడో ప్రపంచ యుద్ధానికి వెళుతుంది. వ్యవహారం తప్పుడు దారిలో వెళుతోంది’’ అని హెచ్చరించారు.  కాగా, జెలెన్‌స్కీకి శాంతి చర్చలు ఇష్టం లేదంటూ ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్‌ పెట్టారు. ‘‘దీన్ని నేను ఒక అవకాశంగా మలచుకోవాలని కోరుకోవడం లేదు. నేను శాంతినే కోరుకుంటున్నా. ఆయన శాంతికి సిద్ధమైతే తిరిగి రావచ్చు’’ అని పేర్కొన్నారు.

 కాగా, జెలెన్‌స్కీని ఇటీవల నియంతగా అభివర్ణించిన ట్రంప్‌ మాట మార్చారు. ఈ ఇద్దరు దేశాధినేతల భేటీకి ముందు విలేకరులు ట్రంప్‌ను ఇదే అంశంపై ప్రశ్నించగా, ‘‘నేనలా అన్నానా? అలా అన్నానంటే నమ్మలేకపోతున్నా’’ అని తెలిపారు. జెలెన్‌స్కీపై తాను చేసిన వ్యాఖ్య అంతగా పట్టించుకోవాల్సిన అంశం కాదని చెప్పారు. 

గురువారం బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ శ్వేతసౌధంలో ట్రంప్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగానే ట్రంప్‌ జెలెన్‌స్కీ గురించి పొడుగుతూ మాట్లాడారు. అతనంటే తనకు అత్యంత గౌరవమని చెప్పారు. తాము ఆయుధాలు ఇచ్చి అండగా నిలిచినా జెలెన్‌స్కీ ధైర్యంగా నిలబడి రష్యా మీద పోరాడటం గొప్ప విషయమని కొనియాడారు.