
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లోకి బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు ఒక్క విజయం లేకుండానే టోర్నీని ముగించింది. సుమారు 30 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌లో జరిగిన ఐసీసీ టోర్నీలో ఆ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. తొలుత న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆ తర్వాత దుబాయ్ వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది.
ఇక ఈ టోర్నీ లీగ్ దశలో ఆ జట్టు బంగ్లాదేశ్‌తో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని ఆ జట్టు భావించింది. కానీ, పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. వర్షం కారణంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్ టాస్ పడకుండానే రద్దయింది. ఈ దెబ్బకు ఈ రెండు జట్లూ టోర్నీ నుంచి నిష్క్రమించాయి.
మ్యాచ్ వేదిక అయిన రావల్పిండిలో గురువారం ఉదయం నుంచి వర్షం కురిసింది. దీంతో గ్రౌండ్ మొత్తం చిత్తడిగా మారింది. ఔట్‌ఫీల్డ్ అంతా జలమయం కావడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. ఫలితంగా టాస్ కూడా వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేసినట్లు ప్రకటించారు అంపైర్లు. ఇరు జట్లకు చెరో పాయింటు కేటాయించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్ కూడా ఒక్క విజయం లేకుండానే టోర్నీని ముగించింది.
ఇక ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు తలపడుతున్నాయి. వీటిని నాలుగేసి జట్ల చొప్పున రెండు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ఇందులో గ్రూప్ ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ ఇప్పటికే సెమీస్‌కు చేరాయి. ఆదివారం టీమిండియా, న్యూజిలాండ్ మధ్య జరిగే పోరులో గెలిచిన జట్టు గ్రూప్-ఏలో అగ్ర స్థానంలో నిలుస్తుంది.
గ్రూప్-బి విషయానికి వస్తే అఫ్ఘానిస్థాన్‌తో ఓటమి పాలై, ఇంగ్లాండ్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మిగిలిన మూడు జట్లు కూడా సెమీస్ రేసులో ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్‌లు రెండు, మూడో స్థానాల్లో ఉన్నాయి. శుక్రవారం ఆస్ట్రేలియా, అఫ్ఘానిస్థాన్ మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా సెమీ ఫైనల్‌కు చేరుతుంది.
స్వదేశంలో జరుగుతున్న మెగా టోర్నీలో పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటుందేమోనని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా చూశారు. దీంతో పాకిస్థాన్ – బాంగ్లాదేశ్ మ్యాచ్ గూగుల్ ట్రెండ్స్‌లో నిలిచింది. భారత్‌లో జమ్మూ కాశ్మీర్, ఒడిశా, బీహార్, లక్షద్వీప్, దాద్రా నగర్ హవేలీ ప్రాంతాల్లో ఈ మ్యాచ్ గురించి ఎక్కువగా సెర్చ్ చేశారు.
More Stories
పాక్ కు అత్యాధునిక మిస్సైల్స్‌ను సరఫరాకు అమెరికా వ్యతిరేకత
గాజాకు సాయం అందించేందుకు అన్ని సరిహద్దులు తెరవాలి
కాబూల్‌పై పాకిస్థాన్ బాంబుల వర్షం… టీటీపీ చీఫ్ హతం?