
* ఆతిశీ సహా 12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సస్పెండ్
ఢిల్లీ అసెంబ్లీలో మంగళవారం ఉదయం సభను ఉద్దేశించి లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ప్రసంగం అనంతరం మద్యం కుంభకోణంపై కాగ్ ఇచ్చిన నివేదికను బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఈ నివేదికను సభలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వ నిధులను పాలకులు దుర్వినియోగం చేశారని, ఎక్సైజ్ పాలసీలో అవకతవకలు జరిగాయని కాగ్ తన నివేదికలో పేర్కొంది.
2021- 2022 ఎక్సైజ్ విధానం కారణంగా ఢిల్లీ ప్రభుత్వం రూ. 2,000 కోట్లకు పైగా నష్టాలను చవిచూసిందని, బలహీనమైన విధాన చట్రం నుండి లోపభూయిష్ట అమలు వరకు అనేక కారణాల వల్ల ఈ నష్టం జరిగిందని కాగ్ నివేదిక పేర్కొంది. లైసెన్సుల జారీ ప్రక్రియలో ఉల్లంఘనలను కూడా కాగ్ నివేదిక గుర్తించింది.
ప్రస్తుతం రద్దయిన ఈ విధానం ఏర్పాటుకు మార్పులను సూచించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ సిఫార్సులను అప్పటి ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ మంత్రి మనీష్ సిసోడియా విస్మరించారని కూడా ఎత్తి చూపింది. కాగ్ నివేదికపై చర్చకు స్పీకర్ విజేందర్ గుప్తా అనుమతించారు. దీంతో ఈ నివేదికపై చర్చను అరవింద్ సింగ్ లవ్లీ ప్రారంభించారు. దీనిపై రెండు రోజులపాటు సభలో చర్చ జరుగుతుంది.
అంబేద్కర్ ఫొటో తొలగించి ప్రధాని మోడీ ఫొటో పెట్టడంపై అతిషి నిరసన వ్యక్తం చేశారు. తిరిగి అంబేద్కర్ ఫొటో పెట్టేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో స్పీకర్ విజేందర్ గుప్తా వారిని సభ నుంచి సస్పెండ్ చేశారు. మాజీ సీఎం, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకురాలు ఆతిశీ సహా మొత్తం 12 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక రోజంతా సమావేశాల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు.
సస్పెండ్ అయిన వారిలో గోపాల్ రాయ్, వీర్ సింగ్ ధింగన్, ముఖేష్ ఆహ్లావత్, చౌదరి జుబేర్ అహ్మద్, అనీల్ ఝా, విశేస్ రవి, జర్నైల్ సింగ్ తదితరులు ఉన్నారు. దాంతో తమ తప్పులు బయటికి వస్తాయనే ఆప్ అంబేద్కర్‌ను అడ్డం పెట్టుకుంటోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ క్రమంలో కాగ్ నివేదికపై విస్తృతంగా చర్చ జరిపి ఆప్ సర్కారు తప్పిదాలను ఎండగట్టాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే అసెంబ్లీ సెషన్‌ను మరో రెండు రోజులు పొడిగించినట్లు తెలుస్తోంది.
More Stories
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!