
తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పిస్తే తప్ప అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోనని భీష్మించుకుని కూర్చున్న మాజీ ముఖ్యమంత్రి, వైసిపి నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం హాజరై, పట్టుమని పది నిముషాలు కూడా కూర్చోకుండా తన పార్టీ ఎమ్యెల్యేలతో కలిసి వాక్ అవుట్ చేసి వెళ్లిపోవడం అంతా నాటకీయంగా జరిగింది.
వరుసగా 60 రోజుల పాటు సమావేశాలకు హాజరు కానిపక్షంలో శాసనసభ్యత్వం కోల్పోవలసి వస్తుందని, పులివెందులకు ఉప ఎన్నిక తప్పదని అధికార కూటమి నేతలు స్పష్టం చేస్తూ ఉండడంతో కేవలం అనర్హత నుండి తప్పించుకోవడం కోసమే హాజరైనట్లు కనిపిస్తున్నది. సోమవారం నాడు బడ్జెట్ సమావేశాల తొలి రోజు వైసీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు చూస్తే వాళ్ళ ఎజెండా ఏంటో స్పష్టంగా వెల్లడైంది.
అటు జగన్ తో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా గవర్నర్ ప్రసంగ సమయంలో కేవలం పది నిమిషాలు కూడా ఉండకుండా వెళ్లిపోయారు. సభలో ఉన్న కొద్దిసేపు కూడా వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అసహనంతో కనిపించారు. మండలిలో ప్రతిపక్ష నేతగా ఉన్న బొత్సా సత్యనారాయణతో ఏదో చెప్పిన కాసేపటికే సభ నుంచి వాక్ అవుట్ చేశారు. ఎలాగు సభకు వచ్చారు కాబట్టి ప్రతిపక్షాన్ని గుర్తించాలి…ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అంటూ నినాదాలు చేశారు కాసేపు.
అసెంబ్లీ నుంచి వాక్ అవుట్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన బొత్స తాము డిమాండ్ చేసినట్లు ప్రతిపక్ష నేత హోదా అంశం తేల్చిన తర్వాతే తమ సభ్యులు అసెంబ్లీకి హాజరు కావాలా వద్దా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దీంతో ఇక రాబోయే రోజుల్లో వైసీపీ సభకు హాజరు అయ్యే అవకాశం లేదని స్పష్టం అయింది.
అసెంబ్లీ లో పదో వంతు మంది సభ్యులు ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా ఇవ్వరు అని…ప్రజలు ఇవ్వని హోదా తాము ఎలా ఇవ్వగలం అంటూ స్పీకర్ అయ్యన్నపాత్రుడుతో పాటు అధికార టీడీపీ కూడా చెపుతూ వస్తోంది. కానీ జగన్ మాత్రం ఇదే డిమాండ్ పెడుతూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన జగన్ తాను మీడియా ముందు ప్రశ్నలు వేస్తే అసెంబ్లీ లో అధికార పార్టీ సమాధానం చెప్పాలని విచిత్రమైన వాదన లేవదీశారు.
చంద్రబాబు కు ఎంత సమయం ఇస్తే తనకు అంత సమయం ఇవ్వాలి అని, ప్రతిపక్ష నేత హోదా ఇస్తే తప్ప సభకు హాజరు అవ్వబోము అని చెప్పి సోమవారం కేవలం సంతకాలు పెట్టటానికి వచ్చి సభ్యత్వాలు పోకుండా చేసుకున్నారనే స్పష్టమైన సంకేతం ఇచ్చారు.
More Stories
లులూ ఫుడ్ పార్క్ లో గోవధ చేస్తారా? మంత్రివర్గంలో ప్రశ్నించిన పవన్
నాయీ బ్రాహ్మణుల సమస్యలు పరిష్కారం బిజెపి థ్యేయం
అన్నమయ్య జిల్లాకు పీఎం ధన ధాన్య కృషి యోజనలో చోటు