ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్

ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ జగన్
తనకు ప్రతిపక్ష నేత హోదా కల్పించనిదే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తూ వస్తున్న మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తున్నది. ఆయనతో పాటు వైసిపి సభ్యులందరూ హాజరుకానున్నారు.
 
అసెంబ్లీకి ముఖం చాటేయడంపై సర్వత్రా విమర్శలు చెలరేగడం, వరుసగా 60 రోజులు హాజరు కానీ పక్షంలో శాసన సభ్యత్వం కూడా కోల్పోవలసి వస్తుందని, పులివెందులలో ఉప ఎన్నిక తప్పదని అధికార పక్షం నాయకులు స్పష్టం చేస్తూ వస్తుండడంతో ఆయన సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తున్నది.
 
సోమవారం నుంచి జరిగే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 24వ తేదీ ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలిని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ఉంటుంది.  సోమవారం ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉండనుంది. గవర్నర్ ప్రసంగానికి వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నట్లు సమాచారం.
 
ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహిస్తారు. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలను ఎన్ని రోజులు పాటు నిర్వహించాలనే దానిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. 24వ తేదీ గవర్నర్ ప్రసంగం, 25న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత రెండు రోజులు సెలవులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పండుగ వచ్చింది. అలాగే ఫిబ్రవరి 27న ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఆ రెండు రోజులు ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకపోవచ్చని తెలుస్తోంది. ఫిబ్రవరి 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అందులో భాగంగా ఫిబ్రవరి 28 ఉదయం 9 గంటలకు ఏపీ కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అదే రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 
 
మరోవైపు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనుున్నారు.
తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై డీజీపీ, ఇతర అధికారులతో సమీక్షించనున్నారు.