
మణిపూర్ లో శాంతిని నెలకొల్పేందుకు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే భద్రతదళాల నుంచి లూటీ చేసిన ఆయుధాలను వారం రోజుల్లోగా అప్పగించాలని రాష్ట్రంలోని అన్ని గ్రూపులకు గురువారం విజ్ఞప్తి చేశారు. తమ వద్ద ఉన్న అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను ఏడు రోజుల్లోగా అప్పగించాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
మందుగుండు సామగ్రిని వారం రోజుల్లోగా తిరిగి ఇచ్చి, లొంగిపోవాలని చెబుతూ అటువంటి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోబోమని ఆయన అభయమిచ్చారు. ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమయ్యే ఏడు రోజుల్లోపు లోయ, కొండ ప్రాంతాల యువత స్వచ్ఛందంగా వచ్చి చట్టవిరుద్ధంగా తీసుకున్న ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సమీపంలోని పోలీస్ స్టేషన్ పోస్ట్ లేదా భద్రతా దళాలకు అందించాలని సూచించారు.
మణిపూర్‌లో ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి బిరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత, ప్రస్తుతం రాష్ట్రపతి పాలన కొనసాగుతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్‌లో గత 20 నెలలుగా రెండు జాతుల మధ్య కొనసాగుతున్న వైరం కారణంగా అనేక మంది మరణించారు. ఈ పరిస్థితి సీఎం రాజీనామా చేసే వరకు వెళ్లగా, ఇప్పుడు దీనిని తగ్గించేందుకు గవర్నర్ ప్రయత్నం చేస్తున్నారు.
”శాంతి, మత సామరస్యతను దెబ్బతీసే దురదృష్టకర ఘటనలతో మణిపుర్‌లోని లోయ, కొండ ప్రాంతాల్లోని ప్రజలు 20 నెలలకు పైగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడ సాధారణ స్థితిని పునరుద్దరించేందుకు ప్రజలు తమ దైనందిన కార్యకలాపాలను కొనసాగించేందుకు వీలుగా అన్ని గ్రూపులు వైరాన్ని వీడి శాంతిభద్రతలను కాపాడుకొనేందుకు ముందుకు రావాలి” అని గవర్నర్ పిలుపిచ్చారు.
“మరీ ముఖ్యంగా యువత అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను సమీపంలోని పోలీస్‌స్టేషన్/అవుట్ పోస్టు/ భద్రతా దళాల క్యాంపుల్లో సరెండర్ చేయాలి. నిర్ణీత సమయంలోగా ఆయుధాలను తిరిగి ఇస్తే ఎలాంటి శిక్షార్హమైన చర్యలు ఉండవు. లేదంటే కఠిన చర్యలు తప్పవు” అని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి శాంతియుతమైన పరిష్కారం కోసం, యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.
“ఉజ్వల భవిష్యత్తు కోసం అందరం కలిసి రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకుందాం.. ముందుకు రండి. శాంతి మార్గాన్ని ఎంచుకోండి” అంటూ ఆ ప్రకటనలో గవర్నర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి, యువత భవిష్యత్తును కాపాడటానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ చెప్పారు.
మన రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం మనమందరం కలిసి పనిచేయాలని ఆయన ప్రజలకు సూచించారు. మణిపూర్‌లో దాదాపు రెండేళ్ల నుంచి ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. మెయిటీ, కుకి జో వర్గాల మధ్య జరిగిన హింస తరువాత రాష్ట్రంలో చాలా కాలం పాటు కర్ఫ్యూ విధించారు. ఆ సమయంలో అనేక మంది పోలీసులు, భద్రతా దళాల నుంచి పలువురు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని దోచుకున్నారు. అవి వారి దగ్గర ఉన్న కారణంగా హింస మరింత పెరుగుతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా మెయిటీ, కుకి జో గ్రూపుల మధ్య జరిగిన జాతి హింసలో 250 మందికి పైగా మరణించగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బీహార్ లో ఎన్డీఏ – మహాఘట్ బంధన్ నువ్వా నేనా?