తీవ్ర నష్టాల బారిన పడిన మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గోనడానికి దేశ రాజధానికి గురువారం వచ్చిన ఆయన పలువురు కేంద్ర మంత్రులతోనూ, ఉన్నతాధికారులతోనూ సమావేశమయ్యారు. 
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కార్యాలయానికి వెళ్లి అక్కడి అధికారులతో సమావేశమయ్యారు. శివరాజ్ వీడియోకాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబుతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రంలో మిర్చి రైతులు ఎదుర్కుంటున్న ఇబ్బందులను శివరాజ్‌కు వివరించారు. వారిని ఆదుకోవడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. 
చంద్రబాబుతో చర్చల తర్వాత చౌహాన్ తన అధికారులతో సమీక్షించారు. ఈ సమస్యపై శుక్రవారం ఉన్నతాధికారుల స్థాయి సమావేశం నిర్వహించాలని అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. మిర్చి రైతుల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించి.. ఒక స్పష్టతకు వచ్చి చర్యలను ప్రారంభిస్తామని చంద్రబాబుకు చౌహాన్ హామీ ఇచ్చారు. 
అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడులతో కలిసి జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. భేటీ తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడూ లేనంతగా ఈ ఏడాది మిర్చి ధర పడిపోయిందని చెప్పారు. ఇతర దేశాల్లో డిమాండ్ తగ్గడంతో రాష్ట్రంలోని రైతులకు తీవ్ర నష్టం వాటెల్లిందని, వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. 
‘ఏపిలో మిరప ఎక్కువగా పండిస్తారు. దేశంలోని 50 శాతం మిరప ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తోంది. రాష్ట్రంలో దాదాపు ఐదు లక్షల ఎకరాల్లో మిరప సాగు జరుగుతోంది. ఈ ఏడాది 12 లక్షల మెట్రిక్ టన్నుల మిరపను సేకరించాలి. ఇప్పటికీ నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఎప్పుడూ లేనంతగా ధరలు ఈ ఏడాది పడిపోయాయి’ అని చెప్పారు. 
మార్కెట్ ఇంట్రవన్స్ స్కీమ్ (ఎంఐఎ) కింద 25 శాతమే జోక్యం చేసుకుంటారు. అయితే ధర నిర్ణయించడానికి ఉద్దేశించిన ఐసిఎఆర్ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న వ్యయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. వాటిని సరి చేయాలని కోరామని తెలిపారు. కాగా,  జల్‌జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టుపై జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో చర్చించినట్టు చంద్రబాబు తెలిపారు. 
‘‘నదుల అనుసంధానంపై చర్చించాం. పోలవరం నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకెళ్లేందుకు కేంద్ర సహకారం కోరాం. దీనిపై అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రతినిధులు త్వరలో ఏపీకి వస్తారు” అని వెల్లడించారు.
                            
                        
	                    
More Stories
ఏపీలో హిందుజా గ్రూప్ రూ.20 వేల కోట్ల పెట్టుబడులు
భక్తుల భద్రత, సౌకర్యాలపై దృష్టి సారించాలి
మాజీ మంత్రి జోగి రమేశ్‌కు 13 వరకు రిమాండ్