కృష్ణా జలాల్లో పాత పంపకాలే కొనసాగుతాయ్! 

కృష్ణా జలాల్లో పాత పంపకాలే కొనసాగుతాయ్! 

* ఏపీకి 66% తెలంగాణకు 34% శాతం కేటాయింపు

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుమతులున్న ప్రాజెక్టుల అవసరాలను పరిగణనలోకి తీసుకుని 2015లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య 66:34 నిష్పత్తిలో జరిపిన కృష్ణా జలాల తాత్కాలిక పంపకాలు కొన సాగుతాయని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లేదా అపెక్స్‌ కౌన్సిల్‌ ఎలాంటి అనుమతులివ్వనందున ఈ తాత్కాలిక సర్దుబాటులో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొంది. 
 
ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాలు గతంలో అంగీకరించిన 66:34 నిష్పత్తిలోనే ప్రస్తుత సంవత్సరంలో సైతం కృష్ణా జలాల కేటాయింపులు జరపాలని నిర్ణయం తీసుకుంది. అయితే 66:34 నిష్ప త్తికి విరుద్ధంగా రాష్ట్రాలకు ఏమైనా అవసరాలు ఏర్పడి నిర్దిష్ట కేటాయింపులు కోరితే ఆ మేరకు నీటి విడుదలకు ఉత్తర్వులు జారీ చేయాలని త్రిసభ్య కమిటీకి సూచించింది. 
 
గత నెల 21న జరిగిన కృష్ణా బోర్డు సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయానికి రెండు రాష్ట్రాలు సమ్మతి తెలిపాయి. తాజాగా రెండు రాష్ట్రాలకు పంపిన సమావేశం మిని ట్స్‌లో వీటిని బోర్డు పొందుపరిచింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించేందుకు మొత్తం 27 టెలిమెట్రీ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకోగా, తొలి విడత కింద 18 స్టేషన్లను ఏర్పాటు చేశారు. రెండో దశ కింద 9 కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. 
 
అయితే, మూడో దశ కింద మరో 11 టెలిమెట్రీ కేంద్రాలను తెలంగాణ ప్రతిపాదించింది. తెలు గుగంగ, గాలేరీ–నగరి, బనకచర్ల హెడ్‌రెగ్యు లేటరీ, క్రాస్‌ డిస్ట్రిబ్యూటరీ, పోతిరెడ్డిపాడు, ముచ్చుమర్రి నుంచి నీళ్లను తరలించుకుంటున్నందున అక్కడ ఏర్పాటు చేయాలని కోరగా ఏపీ అంగీకరించలేదు.  నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు వద్ద సీఆర్‌పీఎఫ్‌ బలగాల మోహరింపును ఉపసంహరించాలని రెండు రాష్ట్రాలు కోరగా, శాంతియుత పరిస్థితులు నెలకొనే వరకు కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది.