తెలంగాణలో మరో 5 నెలల్లో అధికారంలోకి బిజెపి

తెలంగాణలో మరో 5 నెలల్లో అధికారంలోకి బిజెపి

తెలంగాణలో మరో 5 నెలలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జోస్యం చెప్పారు. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తుందని భరోసా వ్యక్తం చేశారు. మంగళవారం మంచిర్యాలలో బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌పై విజిలెన్స్ విచారణ ముగిసినా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎందుకు అరెస్టు చేయడం లేదని  ప్రశ్నించారు.

అలాగే డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా రేసు కేసులు ఎందుకు నీరుగారుతున్నాయని ఆయన నిలదీసేరు. కాంగ్రెస్ అధిష్టానానికి బీఆర్ఎస్ పార్టీ ఏటీఎంలా మారిందని సంజయ్ ఆరోపించారు. న్యూఢిల్లీకి వెళ్లగానే కేసులన్నీ ఆగి పోతున్నాయని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. 317 జీవో రద్దు కోసం కోట్లాడింది బిజేపీ పార్టీనేనని ఆయన స్పష్టం చేశారు.

ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు కేవలం బీజేపీకి మాత్రమే ఉందని స్పష్టం చేశారు. కేసీఆర్ తప్ప తాగి బండి సంజయ్ ఆఫీస్‌ను జేసిబితో కూల్చమని ఆదేశాలు జారీ చేశారని బండి సంజయ్ చెప్పారు. గ్రూప్ -1 పేపర్ లీకైందని తాను నిరసనలు చేస్తే, 10 వ తరగతి హిందీ పేపర్ లీకు చేశారంటూ కేసీఆర్ కేసులు పెట్టారని వివరించారు. ఇక ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు సైతం దొరక లేదని ఎద్దేవా చేశారు.

నిరుద్యోగులకు, టీచర్‌లకు ఇచ్చిన హామీలలో ఏ ఒక్క హామీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేటికి నెరవేర్చ లేదని సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్‌కి ఎందుకు ఓటు వేయాలని ఆ పార్టీ నేతలను నిలదీయండంటూ ప్రజలకు ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణలోని మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోందని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పాల్వాయి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.