యూట్యూబర్‌ రణవీర్‌పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం

యూట్యూబర్‌ రణవీర్‌పై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం

ఇండియాస్‌ గాట్‌ లాటెంట్‌ షోలో కుటుంబ వ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మదిలో ఉన్న మురికిని యూట్యూబ్‌ షోలో వాంతి చేసుకున్నట్లుగా ఉందని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అశ్లీలత, అసభ్యతకు పారామీటర్లు ఏమిటని రణవీర్‌ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. 

అయితే, ఈ కేసులో అరెస్టు నుంచి రణ్​వీర్​కు సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర రక్షణ కల్పించింది. ‘మీరు అన్న మాటాలు సమాజమే సిగ్గుపడేలా ఉన్నాయి. పాపులారిటీ ఉన్నంత మాత్రాన ఏది పడితే అది మాట్లాడటానికి సమాజం అనుమతించదు. మీ మెదడులోని చెత్తనంతా ఆ షో ద్వారా బయటపెట్టారు. ఇలాంటి భాషను ఎవరైనా ఇష్టపడతారా? ఇలాంటి వ్యక్తులకు కోర్టు ఎందుకు రక్షణ కల్పించాలి’ అని సుప్రీం ప్రశ్నించింది.

ముంబయి, గువాహటీలో రణ్‌వీర్‌పై దాఖలైన కేసుల్లో అరెస్టు చేయకుండా ముందస్తు రక్షణ కల్పించిన సుప్రీంకోర్టు, కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో తదుపరి ఆదేశాలిచ్చేవరకూ రణ్‌వీర్‌తోపాటు అతని సహచరులు తమ యూట్యూబ్‌ ఛానెల్‌లో ఎలాంటి ఎపిసోడ్‌లు ప్రసారం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. 

రణ్‌వీర్‌ తన పాస్‌పోర్టును ఠానే పోలీస్‌స్టేషన్‌లో సమర్పించాలని ఆదేశించిన సుప్రీంకోర్టు, ముందస్తు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. మహారాష్ట్ర, అసోంలో దాఖలైన ఎఫ్​ఐఆర్​లకు సంబంధించిన విచారణలకు సహకరించాలని రణ్‌వీర్‌ అల్లాబాదియాకు సూచించింది.

ఈ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు సమాజానికి ఉన్న విలువలు, వాటి పరిమితిలు నీకు తెలుసా? అని అతన్ని ప్రశ్నించింది. సమాజానికి కొన్ని విలువలు ఉన్నాయని, వాటిని గౌరవించడం నేర్చుకోవాలని కోర్టు చెప్పింది. భావస్వేచ్ఛ పేరుతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అని కోర్టు తెలిపింది. నీవు మాట్లాడిన తీరుతో కూతుళ్లు, సోదరీమణులు, తల్లితండ్రులు, సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని యూట్యూబర్‌ అల్లాబదియాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

యూట్యూబ్​లో వచ్చే అశ్లీల కంటెంట్​ గురించి ఏమైనా చేయాలనుకుంటున్నారా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. “మీరు(ప్రభుత్వం) ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఒకేవేళ మీరు ఏమైనా చేయాలనుకుంటే సంతోషిస్తాం. లేకపోతే మేము ఈ వ్యాక్యూమ్​ని వదిలిపెట్టం. యూట్యూబ్​ ఛానెళ్లు, యూట్యూబర్లు దుర్వనియోగం చేస్తున్న ఈ గ్యాప్​ను వదిలిపెట్టబోము” అని జస్టిస్​ సూర్య కాంత్ అదనపు సొలిసిటర్​ జనరల్​ ఐశ్వర్య భాటికి చెప్పారు. 

ఈ విషయంలో అటార్నీ జనరల్​, సొలిసిటర్ జనరల్ సహాయం కోరారు. అతనిపై సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ అతనికి కానీ, అతని కుటుంబానికి కానీ ప్రాణహాని బెదిరింపులు వస్తే, అప్పుడు అతను పోలీసుల్ని ఆశ్రయించవచ్చు అని కోర్టు చెప్పింది.

ఐజీఎల్‌ షోలో పాల్గొన్న ఓ వ్యక్తిని తల్లిదండ్రుల శృంగారం శృంగారం గురించి జుగుప్సాకరంగా ప్రశ్నించడం వల్ల ప్రముఖ యూట్యూబర్‌ రణ్‌వీర్‌ అల్హాబాదియాపై తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. అతడి వ్యాఖ్యలపై పలువురు పార్లమెంటు సభ్యులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సమయ్‌ రైనా షోలో రణ్‌వీర్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు. దాంతో అతడిపై పలు రాష్ట్రాల్లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. 

వాటిపై ఇటీవల యూట్యూబర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు అన్నింటినీ క్లబ్‌ చేయాలని ఓ పిటిషన్‌లో పేర్కొన్నాడు. దానిపైనే తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.