
ఒడిశాలోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నేపాల్ నుంచి వచ్చిన ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండిస్టియల్ టెక్నాలజీ (కిట్) విశ్వవిద్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆందోళన నిర్వహించిన 500కు పైగా నేపాలీ విద్యార్థులు క్యాంపస్ నుంచి స్వదేశానికి వెళ్లాలని వర్సిటీ ఆదేశించింది.
పోలీసుల కథనం ప్రకారం వర్సిటీలో బిటెక్ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆదివారం తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు కారణమైన విద్యార్థిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నేపాల్ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. దీంతో, నేపాల్ నుంచి వచ్చిన విద్యార్థులకు సెలవులు ప్రకటించి, ఇళ్లకు వెళ్లిపోవాలని వర్సిటీ ఆదేశించింది.
దీంతో, 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటక్ రైల్వే స్టేషన్ వద్ద బస్సులతో విద్యార్థులు చేరుకున్నారు. చాలామంది విద్యార్థులకు ఇంటికి తిరిగి వెళ్లడానికి రైలు టిక్కెట్లు లేని స్థితి ఏర్పడింది. నేపాల్ ప్రధానమంత్రి కెపి శర్మ ఓలీ స్పందిస్తూ, విద్యార్థులు ఇళ్లకు వెళ్లాలనుకున్నా, హాస్టల్‌లో ఉండాలనుకున్నా అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు ఎంబసీ నుంచి ఇద్దరు అధికారులను పంపినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
తొలుత తక్షణం క్యాంపస్‌ను ఖాళీ చేయాలని ఆదేశించిన వర్సిటీ ఆ తర్వాత విచారణ పూర్తయ్యేవరకూ తమ సంరక్షకుల సహాయంతో ఇళ్లకు వెళ్లాలని సూచించినట్లు పేర్కొంది. విద్యార్థిని మొబైల్ ఫోన్, లేప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నట్లు భువనేశ్వర్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ పినాక్ మిశ్రా తెలిపారు. ఆమె భౌతికకాయాన్ని మార్చురీలో భద్రపరిచినట్లు చెప్పారు.
విద్యార్థిని ఆత్మహత్యకు కారణంగా భావిస్తున్న విద్యార్థిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని, వారిద్దరి మధ్య వివాదం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని తెలిపారు. ఇంటికి వెళ్లేందుకు డబ్బులు కూడా లేవంటూ పలువురు నేపాల్ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
More Stories
శబరిమల ఆలయంలో 4.5 కిలోల బంగారం మాయం
ఇకపై ఈవీఎం బ్యాలెట్ పేపర్‌పై అభ్యర్థుల కలర్ ఫొటో!
పంట వ్యర్థాల దహనంపై చర్యలు లేదా జైలు .. సుప్రీం