
అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల అధికారం కోల్పోయిన అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. ఆప్ నేతలు బిజెపిలో చేరేందుకు క్యూ కడుతున్నారు. తాజాగా శనివారం ముగ్గురు కౌన్సిలర్లు బిజెపిలో చేరారు. వీరంతా ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.
ఏప్రిల్‌లో దేశంలో ముంబై తర్వాత సంపన్నమైన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ఆప్‌కు శరాఘాతమే అవుతుంది. బీజేపీ విజయావకాశాలు మరింత మెరుగపడతాయి. ఆప్‌కు చెందిన ముగ్గురు కౌన్సిలర్లు అనిత బసోయ (ఆండ్రూస్ గంజ్), నిఖిల్ చాప్రాన (హరి నగర్), ధర్మవీర్ (ఆర్కేపురం) బీజేపీలో చేరారు.
వీరి చేరికపై వీరేంద్ర సచ్‌దేవ మాట్లాడుతూ ‘ఢిల్లీ కేంద్రంలో, అసెంబ్లీ, మున్సిపల్ స్థాయిల్లో ట్రిపుల్ ఇంజన్ సర్కారు ఏర్పడనుంది. మోదీ ఆశిస్తున్న వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా ఢిల్లీ అభివృద్ధికి ఇదే సరైన తరుణం’ అని తెలిపారు. ఢిల్లీని క్లీన్ అండ్ బ్యూటిఫుల్ సిటీగా మార్చేందుకు ఆప్ కౌన్సిలర్లు బిజెపిలో చేరారని ఆయన స్పష్టం చేశారు.
ఎంసీడీ మేయర్ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్‌లో జరగాల్సి ఉన్నాయి. గత మేయర్ ఎన్నికలు 2024 నవంబర్‌లో జరుగగా, మూడు ఓట్ల ఆధిక్యంతో ఆప్ గెలిచింది. ఎంసీడీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కౌన్సిలర్లతో పాటు, ఏడుగురు లోక్‌సభ ఎంపీలు (వీరంతా బీజేపీకి చెందినవారు), ముగ్గురు రాజ్యసభ ఎంపీలు (వీరంతా ఆప్‌కు చెందిన వారు), 14 మంది నామినేటెడ్ ఎమ్మెల్యేలకు ఓటింగ్ హక్కు ఉంటుంది.
తాజాగా ముగ్గురు ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంతో ఆప్ సంఖ్యాబలాన్ని బీజేపీ అధిగమించింది. 2022 ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 వార్డులు, బీజేపీ 104, కాంగ్రెస్ 9, ఇండిపెండెంట్లు 3 వార్డులు గెలుచుకున్నారు. కాగా, ఈనెల 13న ఎంసీడీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.17,000 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో పారిశుధ్యానికి అత్యధికంగా రూ.4,907.11 కోట్లు కేటాయించారు.
More Stories
భారత్‌కు నష్టం కలిగించారనే ఒక్క ఫొటో చూపించగలరా?
వామపక్ష తీవ్రవాదంపై మహారాష్ట్ర కఠిన బిల్!
ఐదేళ్లలో వెయ్యి కొత్త రైళ్లు.. 2027 నాటికి బుల్లెట్ రైలు