మణిపూర్ లో రాష్ట్రపతి పాలన

మణిపూర్ లో రాష్ట్రపతి పాలన

* అక్రమ వలసలను ఆపడంలో తడబడ్డాం : బీరేన్ సింగ్

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చింది. ఈ మేరకు గురువారం సాయంత్రం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్‌లో ముఖ్యమంత్రి పదవికి నాలుగు రోజుల క్రితం బీరేన్ సింగ్ రాజీనామా చేయడంతో ఇప్పుడు ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు.

“రాజ్యాంగ నిబంధనల ప్రకారం మణిపుర్‌లో రాష్ట్ర ప్రభుత్వం పాలనను కొనసాగించే పరిస్థితులు ప్రస్తుతం లేవు అనేది నా అభిప్రాయం. అందుకే రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలనను విధిస్తున్నాను. ఇకపై మణిపుర్‌లోని అన్ని ప్రభుత్వ కార్యకలాపాలు, గవర్నర్ అధికారాలు నా పరిధిలోకే వస్తాయి” అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

2023, మేలో రెండు జాతుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో దాదాపు 250 మందికి పైగా ప్రజలు మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్‌పై ఆరోపణలు వెల్లువెత్తాయి.

అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు దశల వారీగా తమ మద్దతు ఉప సంహరించుకొన్నాయి. అదీకాక ఖ్యమంత్రి పదవీకి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష పార్టీలతోపాటు సొంత పార్టీ బీజేపీలోని ఎమ్మెల్యేలు సైతం బీరెన్‌ సింగ్‌పై ఒత్తిడి తీసుకు వచ్చారు. ఇక ఫిబ్రవరి 10వ తేదీన అసెంబ్లీలో సీఎం బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది

ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 9వ తేదీ ఉదయం న్యూఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి మద్దాలతో సీఎం బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం ఆయన మణిపూర్ చేరుకుని తాను సీఎం పదవికీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బిజెపి ఈశాన్య రాష్ట్రాల ఇన్ ఛార్జ్ సంబిత్ పాత్ర నాలుగు రోజులపాటు ఇంఫాల్ లో మకాం వేసి మరొకరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేసేందుకు ప్రయత్నించినా బీజేపీ ఎమ్యెల్యేలలో ఏకాభిప్రాయం సాధింపలేకపోయారు. దానితో రాష్ట్రపతి పాలన విధింపక తప్పలేదు.
అంతకుముందు, ‘ఇండీజినస్ పీపుల్’ను ఉద్దేశిస్తూ ఎన్ బీరెన్ సింగ్ ఎక్స్లో పోస్ట్ చేశారు. 2023 మే 3 నుంచి రాష్ట్రంలోకి అక్రమ వలసలు పెరిగాయని, వాటిని కట్టడి చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం బాగా ఇబ్బంది పడిందని ఆయన చెప్పారు. మణిపుర్ హింసాకాండను అదునుగా చూసుకొని, రాష్ట్రంలోకి అక్రమ వలసలు జరిగాయని పేర్కొన్నారు. భారీగా జరుగుతున్న వలసల వల్ల మణిపుర్ సామాజిక అస్తిత్వానికే ముప్పు పొంచి ఉందని బీరెన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

“మా భూమికి, మా ఉనికికి ముప్పు పొంచి ఉంది. మా జనాభా తక్కువ. వనరులు తక్కువ. మేం బలహీనంగా ఉన్నాం. మణిపుర్‌లోకి అక్రమ వలసలను ఆపేందుకు 2023 మే 2 వరకు నేను శాయశక్తులా శ్రమించాను. 2023 మే 3న జరిగిన హింసాత్మక ఘటనల తర్వాత అక్రమ వలసలను కట్టడి చేయడంలో తడబడ్డాం” అని బీరెన్ సింగ్ వెల్లడించారు.

“మయన్మార్‌తో మణిపుర్‌కు ఉన్న సరిహద్దులో 398 కిలోమీటర్ల భాగానికి కాపలా లేదు. సరిహద్దుల్లో స్వేచ్ఛగా కదలికలు సాగించగలిగేలా ఆ దేశంతో ఉన్న ఒప్పందం వల్ల మణిపుర్ సామాజిక సమీకరణాల్లో తేడాలు వస్తున్నాయి” అని బీరేన్ సింగ్ చెప్పారు. “2017 మార్చిలో మేం మణిపుర్‌లో అధికారంలోకి వచ్చాం. పరిస్థితిని చక్కదిద్దాం. 2023 మే 3 నుంచి పరిస్థితి మళ్లీ చేజారింది” అని బీరెన్ సింగ్ తెలిపారు.