
నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వద్ద బుధవారం సాయంత్రం పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించింది. పాకిస్తాన్ సైన్యం వరసగా అనేక రౌండ్లు కాల్పులు జరుపుతూ కవ్వింపు చర్యలకు పాల్పడటంతో భారత బలగాలు కూడా అందుకు ధీటుగా బదులిచ్చాయి.
మన దేశ సైన్యం శత్రువుల కాల్పులను సమర్థంగా తిప్పికొట్టంతో దాయాది సైన్యం నుంచి కాల్పులు ఆగిపోయాయి. శత్రుసైన్యం తోకముడుచుకుని పారిపోయింది. ఫిబ్రవరి 25, 2021న భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించినప్పటి నుంచి సరిహద్దుల్లో దాడులు తగ్గాయి. ఈ సంవత్సరంలో దాయాది సైన్యం కాల్పుల విరమణను ఉల్లంఘించడం ఇదే తొలిసారి. ఈ ఘటన తర్వాత సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్తత పెరిగింది. భారత సైన్యం కూడా నిఘాను కఠినతరం చేసింది. శత్రు సైన్యానికి తగిన బుద్ధి చెప్పేందుకు వీలుగా సరిహద్దులో భద్రతా ఏర్పాట్లను సైన్యం బలోపేతం చేస్తుంది.
భారత సైనికులను లక్ష్యంగా చేసుకోవడానికి ఉగ్రవాదులు ముళ్ల తీగల కంచె దగ్గర ఐఈడీని అమర్చారని వర్గాలు తెలిపాయి. పూంచ్ సెక్టార్‌లోని ఎల్‌ఓసీ వద్ద జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడులో ఒక సైనికుడు గాయపడ్డాడని వర్గాలు తెలిపాయి. తాజాగా పాక్ బలగాలకు దుశ్చర్యకు ప్రతిగా భారత సైన్యం బదులిచ్చి దాయాది సైన్యానికి భారీ నష్టం కలిగించి చెమటలు పట్టించింది. అంతేకాదు శత్రుసైన్యం వైపు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోనట్లు వార్తలు వస్తున్నాయి.
గత వారం రోజుల్లో పాకిస్తాన్ వైపు నుంచి ఇలాంటి సంఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి. ఫిబ్రవరి 8న, రాజౌరిలో ఎల్‌ఓసీ వద్ద గస్తీ తిరుగుతున్న సైనికులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపగా భారత సైనికులు తగిన బుద్ధి చెప్పారు. ఇంకా రాజౌరిలోని నౌషెరా సెక్టార్‌లో స్నిపర్ కాల్పులు జరపడంతో ఒక ఆర్మీ సైనికుడు గాయపడ్డాడు.
బుధవారం ఫిబ్రవరి 12న జమ్మూలోని అఖ్నూర్ ఎల్‌ఓసీ సమీపంలో ఉగ్రవాదులు ఐఈడీని అమర్చి పేల్చారు. ఈ దాడిలో ఒక భారత కెప్టెన్ సహా ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. ఒక పక్క పాకీ ఆర్మీ వరస దాడులు చేస్తుంటే.. మరో పక్క ఉగ్రవాదులు చొరబాటు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పాకిస్థాన్ కుట్రలను నిలువరించేందుకు భారత సైనికులు నిఘా కఠినతరం చేశారు.
More Stories
జమ్ముకశ్మీర్లో చైనా గ్రెనేడ్లు స్వాధీనం .. ఉగ్ర కుట్ర భగ్నం
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!