వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వల్లభనేని వంశీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు గురువారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్‌లో ఆయన ఇంటి వద్ద అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు ఆయనను తరలిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై అప్పటి ఎమ్మెల్యే వంశీ అనుచరులు దాడికి పాల్పడ్డారు. సుమారు 5 గంటలపాటు టీడీపీ కార్యాలయంలో విధ్వంసం సృష్టించారు.
దీనిపై అప్పట్లో టీడీపీ నాయకులు కేసులు పెట్టినా పోలీసులు విచారణను అటకెక్కించారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ ఈ కేసు ఊపిరిపోసుకుంది. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వంశీ రెండు సార్లు ఎమ్యెల్యేగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన తర్వాత వంశీ వైసీపీ నేతగా వ్యవహరించారు. పైగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్‌లపై అడ్డూ అదుపు లేకుండా తీవ్ర విమర్శలు చేశారు. అఖరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై కూడా దారుణ విమర్శలు చేశారు.
2024 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలోకి దిగిన వంశీ దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఎన్నికల కౌంటింగ్ రోజున మధ్యలోనే నిరాశతో వెనుదిరిగిన ఆయన అప్పట్నుంచి అజ్ఞాతంలోనే గడుపుతున్నారు. పలు కేసుల్లో నిందితుడు అయిన వంశీ గురించి ఏపీ పోలీసులు గాలిస్తున్నారు. గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వంశీతో పాటు మొత్తం 88 మందిపై పోలీసులు కేసు పెట్టారు.
కాగా, టీడీపీ గన్నవరం కార్యాలయంలో పని చేస్తున్న సత్యవర్థన్ ఫిర్యాదు మేరకు పోలీసులు గతంలో ఈ కేసు నమోదు చేశారు. అయితే హఠాత్తుగా ఫిర్యాదు దారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని రెండు రోజుల క్రితం కోర్టులో అఫిడవిట్ ఇచ్చి అధికార టీడీపీ కి షాక్ ఇచ్చాడు. అయితే సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకొనేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీనికి సంబంధించి మొత్తం ఐదుగురుపై పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
ఇలా ఉండగా, టీడీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీపై దూకుడుగా వ్యవహరించిన కొంతమందిపై చర్యలు ఉంటాయని ఆ పార్టీ నాయకులు భావించారు. నారా లోకేష్ కూడా రెడ్ బుక్ పేరుతో గతంలో హంగామా చేసిన సంగతి తెలిసిందే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమాలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు లేవని సొంత పార్టీ క్యాడరే కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్న తరుణంలో ఇప్పుడు వంశీ అరెస్ట్ అవటం ప్రాధాన్యత సంతరించుకుంది.
More Stories
సూర్యలంకలో నిర్వహించే బీచ్ ఫెస్టివల్ కు వినూత్న ప్రచారం
టీటీడీ పరకామణిలో ఫారిన్ కరెన్సీ దోపిడీపై సీఐడీ దర్యాప్తు
పోలవరం నిర్వాసితులకు పునరావాస హామీలు నెరవేర్చాలి