కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రూ 10 లక్షల కోట్లు ఆవిరి

కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. రూ 10 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం కుప్పకూలాయి. భారీ నష్టాలను చవిచూశాయి. వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. స్టీల్, అల్యూమినియం దిగుమతులపై 25 శాతం టారిఫ్ విధిస్తానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపాయి. 

షాంఘై, జపాన్, థాయ్‌లాండ్, ఇండోనేషియా స్టాక్ మార్కెట్లు సైతం నష్టాలను చవిచూశాయి. భారత స్టాక్ మార్కెట్ సూచీలూ డౌన్ అయ్యాయి. ఒకానొక దశలో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1000కిపైగా పాయింట్లు నష్టపోయింది. చివరకు 1018.20 పాయింట్ల నష్టంతో 76,293.60 వద్ద ముగిసింది.  సెన్సెక్స్‌ 30 సూచీలో ఒక్క భారతీ ఎయిర్‌టెల్ తప్ప మిగతా షేర్లన్నీ నష్టపోయాయి.

ఇందులో ఎక్కువగా నష్టపోయిన బ్లూ చిప్ కంపెనీల్లో పవర్ గ్రిడ్, జొమాటో, టాటా మోటార్స్, అల్ట్రా టెక్ సిమెంట్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ ఉన్నాయి.  బీఎస్‌ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.10 లక్షల కోట్లు ఆవిరై రూ.408 లక్షల కోట్లకు చేరింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 309.80 పాయింట్లు నష్టపోయి 23,071.80 వద్ద ముగిసింది.

నిఫ్టీ ఒకానొక దశలో 23వేల పాయింట్ల దిగువకు చేరింది. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ షేర్లలోనూ అమ్మకాలు భారీగా జరిగాయి.  వాహనాల తయారీకి స్టీల్‌, అల్యూమినియం తప్పక అవసరం. వాటి దిగుమతులపై 25 శాతం టారిఫ్‌ విధిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. దీంతో వాహన రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది.