కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు

కృష్ణానదిపై తొమ్మిది వంతెనల నిర్మాణంకు సన్నాహాలు

అమరావతి రాజధానికి అనుసంధానంగా కృష్ణానదిపై మొత్తం తొమ్మిది వంతెనలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అదే జరిగితే కృష్ణా, గుంటూరు, పల్నాడు, ఎన్‌టిఆర్‌, బాపట్ల జిల్లాలో కొంతభాగం కలిపి అతి పెద్దనగరంగా తయారవనున్నాయి. వీటి నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అమరావతి కొత్త రైల్వేలైన్‌తో సమానంగా వీటిని కూడా పూర్తిచేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. 

అమరావతి ఔటర్‌రింగు రోడ్డుకు కేంద్రం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వీలైనంత త్వరగా మిగిలిన పనులూ పూర్తి చేసుకునేందుకు వీలుగా ప్రణాళికలు రూపొందిస్తోంది. ప్రసుతం కృష్ణానదిపై కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో ప్రకాశం బ్యారేజీ, కనకదుర్గ వారధి ఉన్నాయి. కృష్ణా, బాపట్ల జిల్లాలను కలుపుతూ పెనుమూడి వారధి ఉంది. వీటికితోడు త్వరలో రాజధానిలో నుండి వెళ్లే పశ్చిమ జాతీయ రహదారి వంతెన అందుబాటులోకి రానుంది. 

ఇవి కాకుండా మరో ఆరు వంతెనలు ఏర్పాటు చేయనున్నారు. ఔటర్‌రింగురోడ్డుకు అనుసంధానంగా అమరావతి పశ్చిమ ప్రాంతంలో అమరావతి, మున్నలూరు మధ్య అతిపెద్ద వంతెన నిర్మించనున్నారు. వైకుంఠపురం కేతనకొండ మధ్యలో ఇన్నర్‌రింగురోడ్డుపై మరో వంతెన నిర్మిస్తారు. ఉద్దండ్రాయునిపాలెం, ఇబ్రహీంపట్నం మధ్య రాజధాని ఐకానిక్‌ బ్రిడ్జి కట్టనున్నారు. 

వీటితోపాటు వెంకటపాలెం, సూరాయపాలెం మధ్యలో పశ్చిమ జాతీయ రహదారి వంతెన పూర్తవుతోంది. మొత్తం నాలుగు వంతెనలు అమరావతి నూతన నగరంతో కలిసే విధంగా నిర్మించనున్నారు. ఇవి కాకుండా రాజధాని తూర్పుభాగంలో పెనమలూరు మండలం చోడవరం గుంటూరు జిల్లా రామచంద్రాపురం దగ్గర్లో ఇన్నర్‌రింగురోడ్డు వంతెన కట్టనున్నారు. 

కృష్ణా జిల్లా కాసరనేనివారిపాలెం గుంటూరు జిల్లా పెదకొండూరు మధ్య తూర్పు జాతీయ రహదారి బ్రిడ్జి రానుంది. వల్లూరుపాలెం మున్నంగి మధ్యలో జాతీయ రహదారి వస్తుంది. వీటికి దిగువలో పెనుమూడి వారధి కూడా ఉంది. కృష్ణానదిపై కొత్తగా నిర్మించే వంతెనలన్నీ ఒక్కోదానికి 10 లేదా 15 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉండనుంది. దీంతో ఈ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందుతుందని ప్రభుత్వం చెబుతోంది.

కృష్ణానదిలో పర్యాటకానికి ప్రణాళిక

కొత్తగా నిర్మించబోయే వంతెనలతోపాటు ఒకటీ రెండు బ్యారేజీలు నిర్మించడం ద్వారా నీటిని నిల్వచేసి కృష్ణానదిలో వాటర్‌ ఎమ్యూజ్‌మెంట్‌ ఏర్పాటు చేయాలంటూ గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా విడుదల చేసిన విజన్‌ 2020-21 డాక్యుమెంటులో ప్రస్తావించారు.

దీనిలో భాగంగానే ప్రకాశం బ్యారేజీ నుండి అటు కృష్ణాజిల్లా(ప్రస్తుత ఎన్‌టిఆర్‌), గుంటూరు జిల్లావైపు తాడేపల్లి దగ్గర టైనింగ్‌ వాల్స్‌ నిర్మించి పర్యాటకం, నీటిలో బోటు షికార్లు ఏర్పాటు చేయాలనేది గతంలో ఉన్న ప్లాను. దీన్ని ప్రస్తుతం అమలు చేసేందుకు వీలుగా ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు రిటైనింగ్‌ వాల్స్‌ చేపడుతున్నారు. 

ఎన్‌టిఆర్‌ జిల్లావైపు గోడ నిర్మాణం పూర్తి చేయగా, గుంటూరు జిల్లావైపు నిర్మాణానికి ఇటీవల రూ.294 కోట్లు కేటాయించారు. దీనిలో భాగంగానే పెదపులిపాక సమీపంలో బ్యారేజీ నిర్మాణం చేపట్టాలనేది గత ప్లాను. ఇటీవల ఇచ్చిన మాస్టర్‌ప్లానులో దీన్ని కూడా చూపించారు.