అర్చకుడు రంగరాజన్‌ కు రేవంత్ రెడ్డి పరామర్శ

అర్చకుడు రంగరాజన్‌ కు రేవంత్ రెడ్డి పరామర్శ
 
* దాడిని తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
 
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై జరిగిన దాడిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం రంగరాజన్‌ను ఫోన్‌లో పరామర్శించారు. దాడి వివరాలను ఆయన స్వయంగా అ డిగి తెలుసుకున్నారు. 
 
ఇలాంటి దాడులను సహించేది లేదని సిఎం స్పష్టం చేశారు. ఈ ఘటన గురించి ఆరా తీసిన సీఎం, దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.  సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అర్చకులు రంగరాజన్‌ను పరామర్శించారు. ఈ ఘటనలో ఉన్న 26 మందిలో ఐదుగురిని రిమాండ్‌కి పంపినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. 
 
ఒకటి రెండు రోజుల్లో అందరిని అరెస్టు చేస్తామని, సీఎం ఆదేశాలతో ఇక్కడికి వచ్చి రంగరాజన్‌కి ధైర్యం చెప్పినట్లు ఆమె స్పష్టం చేశారు.  ప్రభుత్వం తరఫున అర్చకులు రంగరాజన్‌కి అన్నివిధాలా అండగా ఉంటామని, దాడులు చేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె తెలిపారు.
 
కాగా, రంగ రాజన్ పై జరిగిన దాడిని కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. వారు ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు అంకితభావంతో సేవలు అందిస్తూ, భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం చేస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని తెలిపారు. అటువంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి నిందనీయం,బాధాకరం, దురదృష్టకరం అని చెప్పారు.

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్య చర్యలకు, బెదిరింపులకు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని ఆయన స్పష్టము చేశారు. ఇది కేవలం ఒక వ్యక్తిపై జరిగిన దాడి మాత్రమే కాకుండా, సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని చెప్పారు. సంబంధిత అధికార యంత్రాంగం ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.