ఆప్ ముగింపునకు ఇది ఆరంభం మాత్రమే

ఆప్ ముగింపునకు ఇది ఆరంభం మాత్రమే

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమికి అరవింద్ కేజ్రీవాల్ కారణమని, ఇది ”పార్టీ ముగింపునకు ఆరంభం” మాత్రమే అని ఆ పార్టీ మాజీ నేత ప్రశాంత్ భూషణ్ విమర్శించారు. ఏ ఉద్దేశంతో పార్టీ పెట్టారో ఆ పార్టీ మూల సిద్ధాంతాలకు కేజ్రీవాల్ తిలోదకాలు ఇచ్చారని, అవినీతి సంస్థగా పార్టీని మార్చారని ఆయన దుయ్యబట్టారు. 

ఢిల్లీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇందుకు భిన్నంగా పారదర్శకతతో పాలించలో విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. 2015లో ప్రశాంత్ భూషణ్‌ను పార్టీ నుంచి ‘ఆప్’ బహిష్కరించింది

”ఆమ్ ఆద్మీ పార్టీ సహజ స్వభావాన్ని కోల్పోయింది. ప్రత్యామ్నాయ రాజకీయాల పేరుతో పార్టీ స్థాపించింది. ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకతతో పాలించడంలో పూర్తిగా విఫలమైంది. లోక్‌పాల్ సిద్ధాంతాలతో రాజకీయ ప్రవేశం చేసి ఇప్పుడు సొంత లోక్‌పాల్‌ను సృష్టించుకుంది. అవినీతి పార్టీగా ముద్రవేయించుకుంది” అని ప్రశాంత్ భూషణ్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విమర్శించారు.

కేజ్రీవాల్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ‘శీష్ మహల్’ కట్టుకున్నారంటూ చెలరేగిన వివాదాన్ని ప్రశాంత్ భూషణ్ ప్రస్తావిస్తూ, ఎన్నికల్లో ఇది ప్రధాన ప్రచార ఆస్త్రంగా మారిందని గుర్తు చేశారు. 

”ఆయన తన కోసం రూ.45 కోట్లతో శీష్ మహల్ కట్టుకున్నారు. లగ్జరీ కార్లలో తిరగడం మొదలుపెట్టారు. ఆప్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సూచించిన 33 సమగ్ర పాలసీ నివేదికలను చెత్తబుట్టలో పడేశారు” అని భూషణ్ ఆరోపించారు. చిత్తశుద్ధితో పాలన అందించడానికి బదులుగా ప్రచారార్భాటాలకు పరిమితమయ్యారని మండిపడ్డారు. ఇది ఆప్ ముగింపునకు ప్రారంభమని ఘాటు వ్యాఖ్యలు చేశారు.