యుఎస్‌ఎయిడ్‌పై ట్రంప్ ఆదేశాలకు ఫెడరల్ జడ్జ్ బ్రేక్

యుఎస్‌ఎయిడ్‌పై ట్రంప్ ఆదేశాలకు ఫెడరల్ జడ్జ్ బ్రేక్
అంతర్జాతీయ అభివృద్ధికి సాయమందించే అమెరికా సంస్థ (యుఎస్‌ఎయిడ్‌)పై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ జారీ చేసిన ఆదేశాలకు బ్రేక్‌ పడింది. ఈ సంస్థకు చెందిన వేలాది మంది ఉద్యోగులు సెలవుపై వెళ్లాలని, విదేశాల్లో దీనికోసం పనిచేసే వారు 30రోజుల్లో వెనక్కి రావాలని ట్రంప్‌ ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలుపుచేస్తూ శుక్రవారం ఫెడరల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు.
 
యుఎస్‌ ఎయిడ్‌ సంస్థ ఉద్యోగులు, విదేశాల్లో పనిచేసే అభివృద్ధి కార్యకర్తల విషయంలో రెండు ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చేసిన వాదనలను యుఎస్‌ డిస్ట్రిక్ట్‌ జడ్జి కార్ల్‌ నికొలస్‌ విన్నారు. ఆ నిర్ణయాల అమలు వల్ల తలెత్తే ముప్పు, ఇబ్బందులను సంఘాలు వివరించాయి. 
 
ఆరు దశాబ్దాలుగా పనిచేస్తున్న ఈ సహాయక సంస్థను అకస్మాత్తుగా మూసివేయడానికి ట్రంప్‌కు అధికారం లేదని, కాంగ్రెస్‌ అనుమతి వుండాల్సిందేనని అమెరికన్‌ ఫారిన్‌ సర్వీస్‌ అసోసియేషన్‌, అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ వాదించాయి. డెమొక్రటిక్‌ సభ్యులు కూడా ఇదే వాదన వినిపించారు. 
 
ఉద్యోగులు సెలవుపై వెళ్లాలని, విదేశాల్లో పనిచేసే వారు 30రోజుల్లో వెనక్కి రావాలని ట్రంప్‌ ఇచ్చిన ఆదేశాల అమలును తాత్కాలికంగా నిలుపుచేస్తూ శుక్రవారం ఫెడరల్‌ జడ్జి ఉత్తర్వులిచ్చారు. అయితే, అభివృద్ధి కార్యకలాపాలకు ఉద్దేశించిన నిధులను స్తంభింపజేయాలన్న ట్రంప్‌ ఉత్తర్వులను తాత్కాలికంగానైనా నిలుపు చేయడానికి న్యాయమూర్తి తిరస్కరించారు. 
 
ఉద్యోగులకు సంబంధించిన వాదనలు, కోర్టు సమీక్ష జరగాల్సిన నేపథ్యంలో ఈ చర్య తీసుకోలేమని చెప్పారు. సంస్థ పేరును చెరిపివేయడానికి ట్రంప్‌ ప్రభుత్వం శుక్రవారం చర్యలు చేపట్టింది. వాషింగ్టన్‌ హెడ్‌క్వార్టర్స్‌ ఎదురుగా గల రాతి ఫలకంపై గల పేరును కప్పిపుచ్చేలా కొంతమంది వర్కర్లు టేప్‌ను అంటించారు. యుఎస్‌ఎయిడ్‌ పతాకాలను కిందకు లాగిపడేశారు.