
ఢిల్లీ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేయబోతున్నాయని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. 27 ఏళ్ల తర్వాత అవినీతి సామ్రాజ్యం హస్తినలో కూలిందని, మార్పు కోసమే ఢిల్లీ ప్రజలు బీజేపీని ఆదరించారని ఆమె స్పష్టం చేశారు. తాను ఢిల్లీలో పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నానని తెలిపారు.
దేశ రాజధానిలో మంచినీళ్లు దొరికే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్ష రేసులో తాను ఉండొచ్చని, అయితే అది హైకమండ్ నిర్ణయమని ఆమె చెప్పారు. రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకుందని ఆమె విమర్శించారు. అందుకే ముందు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తర్వాత సర్పంచ్ ఎన్నికలు అంటున్నారని ఆమె ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం ఎదురు అవుతోందని డీకే అరుణ స్పష్టం చేశారు.
ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రేస్ నేతలు ఇస్తామన్న ఆరు గ్యాంరెంటీ పథకాలు అటకెక్కాయని డీకే అరుణ ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్ల పేరు మార్చకుంటే కేంద్రం నిధులు ఇవ్వదని మాజీ మంత్రి స్పష్టం చేశారు. ప్రధాన ఆవాజ్ యోజన పథకంలో ఆయన ఫోటో లేకుంటే నిధులు ఎందుకిస్తారని ఆమె ప్రశ్నించారు. ఏ పథకాలు అమలు చేయలేక స్ధానిక సంస్దల ఎన్నికలపై ప్రభుత్వం హాడావిడి చేస్తోందని ఆమె మండిపడ్డారు.
స్దానిక సంస్దల ఎన్నికల్లో కాంగ్రేస్‌ను ఓడిస్తేనే ఇచ్చిన హామీలు అమలవుతాయని అరుణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏడాది గడచినా రాష్ట్రంలో పాలన గాడిలో పడలేదని చెబుతూ ఇచ్చిన హమీలు నిలబెట్టుకోకుంటే కేసీఆర్, కేజ్రీవాల్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని అరుణ హెచ్చరించారు. స్ధానిక సంస్ధల ఎన్నికల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బీజేపీని బలపరచాలని ఆమె పిలుపిచ్చారు.
కేంద్రం నిధులు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వం నడిచే పరిస్దితే లేదని ఆమె ఎద్దేవా చేశారు. బీసీ కులగణనకు బీజేపీ, కేంద్రం వ్యతిరేకం కాదని పేర్కొంటూ సర్వేలో చిత్తశుద్ది లోపించిందని, లక్షలాది మంది వివరాలు కులగణనలో నమోదు కాలేదని డీకే అరుణ విమర్శించారు.
More Stories
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?