
కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ ఎట్టకేలకు సవరించింది. రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం ఉదయం వెల్లడించారు. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. వడ్డీ రేట్లను సవరించడం రెండేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
మే 2023 తర్వాత నుంచి కీలక వడ్డీ రేట్లను ఆర్‌బీఐ యథాతథంగా ఉంచుతూ వస్తోంది. దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25 శాతానికి చేరడం గమనార్హం. ఈ తగ్గింపుతో రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. సంజయ్ మల్హోత్రా ఆర్‌బీఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను శుక్రవారం ఆయన వెల్లడించారు.
బ్యాంకులు అకస్మాత్తుగా ఆర్‌బీఐ వద్ద పూచీకత్తు లేకుండా డిపాజిట్లు చేసినప్పుడు వాటిపై స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డీఎఫ్) రేటును వసూలు చేస్తారు. ఎస్‌డీఎఫ్ రేటును 6 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటును 6.5 శాతంగా నిర్ణయించినట్లు సంజయ్ మల్హోత్రా చెప్పారు. కరోనా సంక్షోభ కాలం (2020 మే) తర్వాత ఆర్‌బీఐ రెపోరేటును తగ్గించడం ఇదే తొలిసారి.
“అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్లో నెలకొంటున్న మార్పుల ప్రభావం కూడా మన ఆర్థిక వ్యవస్థపై ఉంటుంది. దీనివల్ల ప్రపంచ దేశాల వాణిజ్యంపైనా ప్రతికూల ప్రభావం పడింది. ఫలితంగా ఆయా ఆర్థిక వ్యవస్థల వృద్ధి చారిత్రక కనిష్ఠ స్థాయిలకు పడిపోయింది. అమెరికాలోనూ వడ్డీరేట్లను భారీగా తగ్గిస్తారనే అంచనాల వల్లే అమెరికా డాలర్ బలోపేతం అవుతోంది. ఈ ప్రతికూలతల వల్లే ఇటీవలే భారత రూపాయిలో క్షీణత కనిపించింది” అని ఆర్‌బీఐ గవర్నర్ చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు