తీవ్ర ఇబ్బందుల్లో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌

తీవ్ర ఇబ్బందుల్లో వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌

వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంద ని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. లోక్‌సభలో జనసేన ఎంపి వల్లభనేని బాలశౌరి, బిజెపి ఎంపి సిఎం రమేష్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

‘2024-25 (ఏప్రిల్‌-డిసెంబర్‌ 2024)లో రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌) 2.68 మిలియన్‌ టన్నుల హాట్‌ మెటల్‌, 2.37 మిలియన్‌ టన్నుల సేలబుల్‌ స్టీల్‌ను ఉత్పత్తి చేసింది. 2024 ఏప్రిల్‌-డిసెంబర్‌లో ఆర్‌ఐఎన్‌ఎల్‌ మొత్తం ఆదాయం రూ.12,615.03 కోట్లు వచ్చిందని, ఈ కాలంలో రూ.3,943.43 కోట్ల నష్టాన్ని చవిచూసింది’ అని తెలిపారు.

2024 డిసెంబర్‌ 31 నాటికి ఆర్‌ఐఎన్‌ఎల్‌ మొత్తం అప్పులు దాదాపు రూ.38,965.00 కోట్లు అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌కు రూ.10,300 కోట్ల ఈక్విటీ మూలధనాన్ని (2024 సెప్టెంబర్‌లో ఇప్పటికే అత్యవసర నిధులుగా అందించిన రూ.500.00 కోట్లతో సహా), రూ.1,140 కోట్ల వర్కింగ్‌ క్యాపిటల్‌ లోన్‌ను 7 శాతం నాన్‌క్యుములేటివ్‌ ప్రిఫరెన్స్‌ షేర్‌ మూలధనంగా మార్చడానికి ఆమోదం తెలిపిందని చెప్పారు. 

ఆర్‌ఐఎన్‌ఎల్‌ 2024 సెప్టెంబర్‌, అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో ఉద్యోగులకు పాక్షిక జీతాలను విడుదల చేసిందని తెలిపారు. ఈ ఆందోళనలు తగ్గించేందుకు కేంద్రప్రభుత్వ ప్యాకేజీ ఉపయోగపడుతుందని చెప్పారు.