ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్‌ బాంబు.. ముగ్గురు జవాన్లకు గాయాలు

ఛత్తీస్‌గఢ్‌లో పేలిన ప్రెషర్‌ బాంబు.. ముగ్గురు జవాన్లకు గాయాలు
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబు పేలిన ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన మంగళవారం బీజాపుర్‌, దంతెవాడ జిల్లాల సరిహద్దులో చోటుచేసుకుంది. డిస్ట్రిక్‌ రిజర్వ్‌ గార్డ్స్‌, సీఆర్‌ఫీఎఫ్‌ జవాన్లు మంగళవారం కూంబింగ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌ బాంబ్‌పై ఇద్దరు జవాన్లు అడుగు వేయడంతో అది పేలింది. 
 
ఆ ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. మరో జవాను మావోయిస్టులు అమర్చిన బూబీ ట్రాప్‌పై అడుగు వేయడంతో గాయపడ్డాడు. గాయపడ్డ జవాన్లను రాయపూర్‌ ఆస్పత్రికి తరలించారు. కేంద్ర బలగాలు గంగలూరు అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలింది. గాయపడ్డ జవాన్ల పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని బీజాపూర్‌ పోలీసులు తెలిపారు. 
 
బీజాపూర్‌ జిల్లా బడ్గిచెరులో మావోయిస్టులు ఇద్దరు గిరిజనులను హత్య చేశారు. బడ్గిచెరుకు చెందిన కరం రాజు, మాద్వి మున్నా అనే గిరిజనులు ఇంట్లో నిద్రిస్తుండగా మంగళవారం తెల్లవారుజామున మావోయిస్టులు వారిని బయటకు తీసుకెళ్లి గొంతుకోసి హత్య చేశారని పోలీసులు తెలిపారు.
కాగా, పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించారంటూ ఛత్తీస్‌గఢ్‌లో ఇద్దరు వ్యక్తులను మావోయిస్టులు హత్య చేశారు. తమ సమాచారాన్ని పోలీసులకు చేరవేస్తున్న వారందరికీ ఇదే శిక్ష పడుతుందంటూ ఓ హెచ్చరిక లేఖను సంఘటనా స్థలంలో వదిలివెళ్లారు. బీజాపుర్‌ జిల్లా బాసగూడ పోలీసు స్టేషన్‌ పరిధి బుడిగిచెర్వు గ్రామంలో ఈ ఘటన జరిగింది. 
 
సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సాయుధ మావోయిస్టులు బుడిగిచెర్వు చేరుకున్నారు. గ్రామానికి చెందిన కారం రాజు(32), మడ్వి మున్నా(27)లను వారి ఇళ్లనుంచి గ్రామ శివారుకు తీసుకెళ్లి హత్య చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.