ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా వేడుకలో బుధవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాజాగా సంగం ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆపై పవిత్ర స్నానం చేశారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ చేతిలో రుద్రాక్ష జపమాల పట్టుకుని మంత్రాలు జపిస్తూ సంగమంలో స్నానం ఆచరించారు. అనంతరం ఆయన అఖారాలు, ఆచార్యవాడ, దండివాడ, ఖాక్‌చౌక్ ప్రతినిధులను కలిశారు.. వారితో కొత్త సేపు మాట్లాడారు.. వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు.
దీనికి ముందు ప్రధాని మోదీ గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమ స్థలానికి చేరుకోవడానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి పడవలో సంగం ఘాట్‌కు చేరుకున్నారు. మోదీ సంగం ఘాట్‌కు చేరుకున్న వెంటనే, మోదీ మోదీ అంటూ అక్కడి ప్రజలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మోదీ ఈరోజు ప్రయాగ్ రాజ్‌లో రెండున్నర గంటలు బస చేశారు.
‘మహా కుంభమేళాకు హాజరు కావడం దైవానుగ్రహమే’ అని భావిస్తున్నానని ఆయన తెలిపారు. ‘భక్తితో ధ్యానంలో నిమగ్నమైనట్లు’ ఆయన చెప్పారు. ప్రధాని మోదీ పుణ్య స్నానం ఆచరిస్తున్నప్పుడు చేతిలో రుద్రాక్షమాల పట్టుకున్నారు. ముదురు కాషాయ రంగు జెర్సీ ధరించిన మోడీ మంత్రోచ్చాటన చేస్తూ సూర్యునికి, గంగకు ప్రార్థనలు చేశారు.
‘ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాలో పాల్గొనడం దైవానుగ్రహమే. త్రివేణి సంగమం వద్ద కోట్లాది మందిఇతర భక్తుల వలె పుణ్య స్నానం ఆచరించాను. ‘భక్తితో ధ్యానంలో నిమగ్నమయ్యాను’ అని మోదీ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ‘గంగా మాత శాంతి, విజ్ఞత, మంచి ఆరోగ్యం, సమరస భావంతో అందరినీ ఆశీర్వదించుగాక’ అని ప్రధాని పేర్కొన్నారు.
ప్రధాని ఆ ప్రదేశానికి చేరుకునేటప్పుడు నదికి రెండు వైపుల బారులు తీరిన జనసమూహం చేతులు ఊపుతుండగా ఆయన ప్రత్యభివాదం చేశారు. పవిత్ర స్నానం ఆచరించిన తరువాత ప్రధాని మోదీ నదిపై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక వేదికపైకి ఎక్కి హారతి సహా పూజాదికాలు నిర్వహించారు. ఆయన పవిత్ర నదులకు పాలు, పూలు సమర్పించారు. ఆయన త్రివేణి సంగమం వద్ద ఒక చీర కూడా సమర్పించారు. ఒక అర్చకుని మార్గదర్శకంలో ప్రధాని మోడీ ఆ ప్రక్రియలు నిర్వర్తించారు.
స్థానిక నివాసితులు, మహా కుంభమేళాకు వచ్చే భక్తులు ప్రధాన మంత్రి మోదీ రాక పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. దీనికి ముందు కూడా ప్రధాని మోదీ 6 సంవత్సరాల క్రితం సంగంలో స్నానం చేశారు. 2019 కుంభమేళాలో ప్రధాని మోదీ పారిశుధ్య కార్మికుల పాదాలను కడిగారు. అదే సమయంలో మహా కుంభమేళా ప్రారంభానికి ముందు, డిసెంబర్ 13న, ప్రధాని మోదీ కూడా ప్రయాగ్‌రాజ్‌కు వచ్చి అనేక పథకాలను ప్రారంభించారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి 5కు చాలా మతపరమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజు ను భీష్మాష్టమి అని కూడా అంటారు. ఈరోజు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఈ రోజున తపస్సు, ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలు చేస్తే మంచిదని చెబుతుంటారు. ఈ రోజున అలాంటివి చేసేవారి కోరికలన్నీ నెరవేరుతాయని అనేక మంది భావిస్తారు.
మత విశ్వాసాల ప్రకారం మహాభారత సమయంలో భీష్మ పితామహుడు బాణాల మంచం మీద పడుకుని సూర్యుడు ఉత్తరం వైపుకు, శుక్ల పక్షం వైపు కదులుతున్నందుకు వేచి ఉన్నారు. ఆ క్రమంలో మాఘ మాసం ఎనిమిదో రోజున శ్రీకృష్ణుని సన్నిధిలో తన ప్రాణాలను త్యాగం చేశారు. దీని ఫలితంగా ఆయనకు మోక్షం లభించింది. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పండితులు చెబుతున్నారు.
More Stories
నేపాల్ తాత్కాలిక నాయకత్వంపై నేపాల్ జెన్ జెడ్‌లో చీలిక!
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్