
చరిత్రలో తొలిసారిగా మిలిటరీ విమానాల్లో అక్రమ వలసదారులను స్వదేశాలకు తరలించే ప్రక్రియ ప్రారంభమయ్యింది. శాన్ ఆంటోనియో నుండి అమెరికా సీ 17 యుద్ధ విమానంలో బయలుదేరిన 205 మంది వలసదారులు బుధవారం మధ్యాహ్నం అమృత్‌సర్‌కు చేరుకున్నారు. భారతీయులతో టెక్సాస్ నుంచి బయలుదేరిన యూస్ మిలటరీ సీ-17 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ బుధవారం మధ్యాహ్నం పంజాబ్‌లోని అమృత్‌సర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.
తొలి దశలో 20 వేలమంది భారతీయులను తరలించేందుకు అమెరికా సిద్ధమైంది. ఈ మొదటి విమానం అమృతసర్‌లోనే ల్యాండ్ అవ్వడానికి కారణమేమిటంటే ఆ దేశంలో అక్రమంగా వలస ఉంటున్నవారిలో అగ్రస్థానం పంజాబీలు కాగా, రెండో స్థానంలో గుజరాతీలున్నారు. వీళ్ళంతా వేర్వేరు సమయాల్లో డంకీ రూట్‌లో అక్కడికి వలసవెళ్లినవారు. డంకీ అంటే అక్రమంగా చొరబడటం.
కాగా, విమానాశ్రయానికి చేరుకున్న వారిని నిర్బంధంలోకి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు లేవని, డాక్యుమెంట్ల వెరిఫికేషన్ పూర్తి చేసి ఎయిర్‌పోర్ట్ నుంచి వారిని బయటకు పంపుతారని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే రోజుల్లో భారతీయ వలసదారులతో మరిన్ని విమానాలు అమెరికా నుచి రావచ్చని చెబుతున్నారు.
అయితే ఇందుకు సంబంధించిన నిర్దిష్ట వివరాలు చెప్పేందుకు అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి నిరాకరించారు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడం, ఇమిగ్రేషన్ చట్టాలను కట్టుదిట్టం చేయడం, అక్రమ వలసదారులను వెనక్కి పంపించడంపై అమెరికా గట్టి చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
భారత్ సైతం అక్రమ వసలకు తాము కూడా వ్యతిరేకమని చెబుతోంది. వీసా గడువు ముగిసినా సరైన డాక్యుమెంట్లు లేకుండా చట్టవిరుద్ధంగా భారతీయులు ఎక్కడున్నా వెనక్కి తీసుకువచ్చేందుకు వెసులుబాటు కల్పిస్తామని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్ జైశ్వాల్ ఇటీవల తెలిపారు. అయితే, అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న భారతీయుల సంఖ్యపై ఇప్పుడే చెప్పడం సరికాదన్నారు.
మరోవంక, అక్రమ వలసదారులపై నిఘా పెట్టిన అమెరికా ఖర్చుకు వెనుకాడటం లేదు. ఎన్నడూ లేనంత ఖర్చు పెట్టి వలసదారులను ఆయా దేశాలకు యుద్ధ విమానాల్లో తరలింపును ప్రారంభించింది. అమెరికా నుంచి ఇండియాకు తరలించేందుకు ఒక్కొక్కరిపై 4,675 డాలర్లు అంటే 4 లక్షల 6 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది. తొలి దశలో వచ్చిన 205 మందిపై అప్పుడే 8 కోట్ల 33 లక్షల రూపాయలు వెచ్చించింది. మొత్తం 7.25 లక్షల మందిని తరలించేందుకు వేల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమైంది.
More Stories
దేశంలో 14 శాతం పెరిగిన వరకట్నం కేసులు
బీహార్ లో తుది ఓటరు జాబితాను విడుదల చేసిన ఈసీ
క్యాన్సర్ పరిశోధనలో భారతీయ కుత్రిమ మేధ