
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కేంద్ర బడ్జెట్‌ను ‘ప్రజల ద్వారా, ప్రజల కోసం’గా అభివర్ణించారు. మధ్య తరగతి ప్రజల కోసం పన్నుల తగ్గింపు ఆలోచన వెనుక ఉన్నది ప్రధాని నరేంద్ర మోదీయేనని, అయితే, అధికారులకు నచ్చజెప్పడానికి సమయం పట్టిందని మంత్రి తెలియజేశారు. ‘మేము మధ్య తరగతివారి వాణి విన్నాం’ అని, తాము నిజాయతీ కలిగిన పన్ను చెల్లింపుదారులం అయినప్పటికీ తమ ఆకాంక్షలు నెరవేరడం లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారని నిర్మలా సీతారామన్ ఒక ఇంటర్వూలో ‘పిటిఐ’తో చెప్పారు.
ద్రవ్యోల్బణం వంటి అంశాల ప్రభావాన్ని పరిమితం చేయడానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని నిజాయతీపరులైన, గర్వకారకులైన పన్ను చెల్లింపుదారులు కోరుతుండడంతో ప్రధాని వెంటనే కల్పించుకుని, వారికి ఉపశమనం కలిగించే మార్గాలు చూసే బాధ్యతను సీతారామన్‌కు అప్పగించారు. పన్ను రాయితీకి మోదీ శీఘ్రంగా అంగీకరించినా, ఆర్థిక మంత్రిత్వ శాఖ, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి)లోని సంక్షేమ. ఇతర పథకాల కోసం రెవెన్యూ వసూలు బాధ్యత గల అధికారులను ఇందుకు ఒప్పించడానికి సమయం పట్టిందని సీతారామన్ తెలియజేశారు.
మంత్రి సీతారామన్ వరుసగా తన ఎనిమిదవ బడ్జెట్‌ను శనివారం సమర్పిస్తూ, వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని రూ. 7 లక్షల నుంచి పెంచుతున్నట్లు ప్రకటించారు. పన్ను చెల్లింపుదారులకు రూ. 12 లక్షల వరకు ఎటువంటి పన్నూ ఉండదు. పన్ను బ్రాకెట్లలో కూడా ఆమె మార్పులు చేశారు. దాని వల్ల అధిక వేతన జీవులు రూ. 1.1 లక్షల వరకు ఆదా చేయగలుగుతారు.
మినహాయింపు పరిమితిలో రూ. 5 లక్షల హెచ్చింపు ఇదివరకు ఎన్నడూ లేనంత అధికం. 2005- 2023 మధ్య ఇచ్చిన వెసులుబాట్లు అన్నిటికీ అది సమానం, ‘ప్రధాని దానిని క్లుప్తంగా పేర్కొన్నారు, అది ప్రజల బడ్జెట్, అది ప్రజలు కోరుకున్న బడ్జెట్ అని ఆయన అన్నారు’ అని సీతారామన్ తెలిపారు. తన సొంత మాటల్లో బడ్జెట్ లక్షణాన్ని వివరించవలసిందని కోరినప్పుడు, ‘అబ్రహాం లింకన్ మాటల్లో ప్రజాస్వామ్యంలో వారంటున్నట్లుగా అది ప్రజల ద్వారా, ప్రజల కోసం, ప్రజల యొక్క బడ్జెట్’ అని నిర్మల పేర్కొన్నారు.
కొత్త రేట్లు ‘మధ్య తరగతివారి పన్నులను గణనీయంగా తగ్గించి, వారి చేతుల్లో ఎక్కువ డబ్బు ఉంచుతాయి, గృహ వినియోగాన్ని, పొదుపు మొత్తాలను, పెట్టుబడిని పెంచుతాయి’ అని సీతారామన్ వెల్లడించారు. ఈ భారీ ప్రకటన వెనుక ఆలోచనను సీతారామన్ వివరిస్తూ, పన్ను కోతల అంశంపై కొంత కాలంగా కృషి సాగుతోందని చెప్పారు.
More Stories
ఖతార్ అధినేతకు స్వయంగా ఎయిర్పోర్ట్కు వెళ్లి మోదీ స్వాగతం!
కొత్త సీఈసీగా జ్ఞానేశ్కుమార్
రైల్వేస్టేషన్లలో ప్రయాణికుల రద్దీ నియంత్రణకు కుత్రిమ మేధ